మహారాష్ట్ర రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ.. అవసరమైతే మళ్లీ ఎన్నికలను ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగానే ఉంది. ఇది ఆశ్చర్యకరమైన పరిణామమే.
ఏ పార్టీకైనా ప్రభుత్వం ఏర్పాటుచేసే సత్తా స్వయంగా లేకపోవడం వలన… ఇతర పార్టీలతో సయోధ్య కుదరకపోవడం వలన వెంటనే మళ్లీ ఎన్నికలు రావడం ఒక ఎత్తు. కూటమిగా పోటీచేసిన పార్టీలు మెజారిటీ సాధించినప్పటికీ.. వారి మధ్య అధికారం పంపకాలు సవ్యంగా జరగకపోవడం మూలాన.. మళ్లీ ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుండడమే ఆశ్చర్యకరం. శివసేన మెట్టు దిగి రాకపోతే.. అదే పరిస్థితి తప్పదు. అలాంటి అనివార్యమైన పరిస్థితుల్లో శివసేన రాజీపడుతుందేమో అనిపిస్తోంది.
అధికారాన్ని పంచుకునే విషయంలో తమకు తొలి రెండున్నరేళ్లు సీఎం పోస్టు ఇస్తే తప్ప ఊరుకోమని శివసేన ఎలాగైతే భీష్మించుకుంటోందో… డిప్యూటీ సీఎం తప్ప.. అసలు సీఎం పోస్టులో వాటా ఇచ్చేదే లేదంటూ భాజపా కూడా అంతే గట్టిగా పట్టుబట్టి కూర్చుంది. దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి గడువు దగ్గర పడుతుండగా.. సంక్షోభం ముదురుతోంది.
భాజపా అధికారం ఇవ్వకుంటే.. ప్రత్యామ్నాయ నిర్ణయం తీసుకుంటామని శివసేన చాలా బెట్టు చూపించింది. మద్దతివ్వడానికి మేం రెడీ అనే లోకల్ కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్ముకుని వారు అలాంటి పంతానికి పోయినట్లుగా కనిపించింది.
కానీ.. రెండురోజుల కిందట.. కాంగ్రెసు అధినేత్రి సోనియా, శివసేనకు మద్దతివ్వడానికి ససేమిరా ఒప్పుకోలేదనే వార్తలు వచ్చాయి. అది ఒక భంగపాటు కాగా.. తాజాగా తాము ప్రతిపక్షంలో ఉండడానికే ఇష్టపడతాం అంటూ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పష్టం చేయడంతో శివసేన ఖంగు తిని ఉంటుంది. పైగా, శివసేన తరఫు రాయబారి సంజయ్ రౌత్ వెళ్లి పవార్ ను కలిసిన తర్వాతే.. ఈ ప్రకటన రావడం వలన.. ఇక వారి చేతుల్లో ఏమీ లేదనే అభిప్రాయానికి రావొచ్చు.
ఇప్పుడు మహారాష్ట్రలో రెండే సంభావ్యతలు ఉన్నాయి. శివసేన తలొగ్గి భాజపా చెప్పిన మాట విని డిప్యూటీ సీఎం పదవి తీసుకుని ప్రభుత్వంలో ఉండాలి. లేదా… ఎన్నికలను మళ్లీ ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. మళ్లీ ఎన్నికలు అంటే.. భాజపాతో పొత్త ఉండదు గాక ఉండదు. కూటమిలోని ఈ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేయాల్సి ఉంటుంది.
అదే సమయంలో కాంగ్రెస్- ఎన్సీపీ మళ్లీ కలిసే పోటీచేస్తే.. అధికారాన్ని పూర్తిగా వారు తన్నుకుపోగల చాన్సు కూడా ఎక్కువ. ఇలాంటి నేపథ్యంలో శివసేన మెట్టు దిగక తప్పదనే పలువురు అనుకుంటున్నారు.