ఈరోజు సాయంత్రం నుంచి దర్బార్ హంగామా మొదలుకాబోతోంది. రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ ను ఒకేసారి అన్ని భాషల్లో విడుదల చేస్తున్నారు. అయితే దీనిపై దర్శకుడు మురుగదాస్ స్పందించిన తీరు మాత్రం వివాదాస్పదమైంది.
దర్బార్ మోషన్ పోస్టర్ ను ఆయా భాషలకు చెందిన సూపర్ స్టార్లు రిలీజ్ చేస్తారని ప్రకటించిన మురుగదాస్, తెలుగు మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసే బాధ్యతను మాత్రం కమల్ హాసన్ కు అప్పగించాడు.
హిందీలో దర్బార్ మోషన్ పోస్టర్ ను సల్మాన్ ఖాన్ రిలీజ్ చేస్తున్నాడు. మలయాళంలో మోహన్ లాల్ రిలీజ్ చేస్తున్నాడు. తమిళ్ లో కమల్ హాసన్ రిలీజ్ చేయబోతున్నాడు. సో.. తెలుగులో ఈ మోషన్ పోస్టర్ రిలీజ్ చేయాలంటే అది చిరంజీవి మాత్రమే. కానీ ఆశ్చర్యకరంగా తెలుగు మోషన్ పోస్టర్ ను కూడా కమల్ హాసన్ చేతుల మీదుగానే విడుదల చేయబోతున్నారు.
రజనీకాంత్, చిరంజీవి మధ్య సత్సబంధాలే ఉన్నాయి. చాలా సందర్భాల్లో ఇద్దరూ కలుసుకున్నారు కూడా. రజనీకాంత్ ఒక్క మాట అడిగితే, మోషన్ పోస్టర్ రిలీజ్ చేయడానికి చిరంజీవికి ఎలాంటి అభ్యంతరం ఉండదు. కానీ చిరంజీవికి రజనీకాంత్ ఫోన్ చేయలేదని తెలుస్తోంది. అందుకే ప్రస్తుతం ఖాళీగానే ఉన్నప్పటికీ, ఈ కార్యక్రమానికి చిరంజీవి దూరంగా ఉంటున్నాడు.
రజనీకాంత్, మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతోంది దర్బార్ సినిమా. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు. తెలుగులో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను దిల్ రాజు దక్కించుకునే అవకాశం ఉంది.