డిసెంబర్ 31 రాత్రి. అందరూ బీర్లు, బిర్యానీలతో పార్టీ చేసుకునే టైమ్ అది. కేరళలోని కాసర్ గోడ్ ప్రాంతం పెరుంబళకు చెందిన అంజు శ్రీ పార్వతి అనే యువతి కూడా ఆన్ లైన్లో బిర్యానీ ఆర్డర్ ఇచ్చింది. కుజిమంతి అనే లోకల్ ఫ్లేవర్ బిర్యానీ అది. స్థానికంగా ఉన్న రొమేనియా రెస్టారెంట్ నుంచి ఆ పార్శిల్ వచ్చింది. బిర్యానీ రాగానే ఇష్టంగా తిన్నది అంజు శ్రీ పార్వతి. లెగ్ పీస్ తిన్న తర్వాత ఆమె ఒక్కసారిగా కుప్పకూలింది. వాంతులతో హెల్త్ అప్సెట్ అయింది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటినుంచి ఆస్పత్రి బెడ్ పై ఉన్న అంజు.. ఈరోజు ఉదయం చనిపోయింది.
రెస్టారెంట్ సీజ్.. ఎంక్వయిరీ స్టార్ట్..
డిసెంబర్ 31న కేక్ లు, బిర్యానీల డెలివరీలు ఎంత శుఛి శుభ్రంగా ఉంటాయో అందరికీ తెలుసు. ఆ హడావిడిలో ఫార్మాలిటీకోసం అందరూ కేక్ లు తెప్పించుకుంటారు కానీ, దాని టేస్ట్ ని పెద్దగా ఆస్వాదించలేరు. బిర్యానీ కూడా అంతే. ఆర్డర్లు ఎక్కువగా వస్తే దానిలో క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. అయితే ఇక్కడ నిర్లక్ష్యం తోడవడంతో బిర్యానీ చెడిపోయింది. చెడిపోయిన బిర్యానీని అలాగే పార్శిల్ చేశారు హోటల్ నిర్వాహకులు. దీంతో అంజులాంటి వారు చాలామంది ఆస్పత్రిపాలయ్యారు. అయితే అంజుకి తీవ్ర అస్వస్థత కలగడం, ప్రాణాపాయ స్థితికి చేరడం, చివరకు ప్రాణాలు పోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇరవయ్యేళ్ల అంజు మరణంపై కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ విచారణకు ఆదేశించారు.
కొట్టాయం మెడికల్ కాలేజీలో కూడా ఈ వారం ఇలాంటి ఘటనే జరిగింది. ఓ నర్సు కోజికోడ్ లోని ఓ హోటల్ నుంచి పార్శిల్ తెప్పించుకుని తిన్న తర్వాత ఫుడ్ పాయిజనింగ్ వల్ల మరణించింది. అయితే అంజు మరణం మాత్రం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. కేరళలో కుజిమంతి బిర్యానీ ఎంతో ఫేమస్. ఇప్పుడా ఫేమస్ బిర్యానీయే అంజు ప్రాణం తీసింది. ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదుతో పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.