ఒక్క మాట ఇటు నుంచి వస్తే పది మాటలు అటునించి వస్తాయి. కోటి రూపాయల రెమ్యూనిరేషన్ తీసుకుంటూ, ఏస్ డైలాగ్ రైటర్ అనిపించుకుంటున్న బుర్రా సాయి మాధవ్ ఈ చిన్న విషయం మరిచిపోయారు.
వీర సింహా రెడ్డి సినిమాలో పొలిటికల్ డైలాగులు లేకపోయినా వచ్చిన నష్టం లేదు. సినిమాలో విషయం వుంటే బాక్సాఫీస్ దగ్గర కుమ్మేస్తుంది. పైగా హీరో బాలకృష్ణ కూడా కోరి తన సినిమాలో కాంటెంపరరీ పొలిటికల్ డైలాగులు రాయండి అని అడిగే రకం కాదు. గోపీచంద్ మలినేని కూడా అడిగి వుంటారు అని అనుకోవడానికి లేదు.
సో, అందువల్ల బాలకృష్ణ ప్రేక్షకులు అంటే తెలుగుదేశం అభిమానులే అయివుంటారని అనుకున్నారో, ఏమో, బుర్రా తన పదును వాడి సినిమాలో పొలిటికల్ డైలాగులు చొప్పించారు. సంతకం డైలాగు, డిఎన్ఎ డైలాగు ఇప్పటికే ట్రయిలర్ లోకి వచ్చాయి. దీంతో సోషల్ మీడియాలో యాంటీ టీడీపీ జనాలు ఒక్క ఎత్తున విరుచుకుపడుతున్నారు.
ఆ సంతకమే ఎన్టీఆర్ పేరును ఓ జిల్లాకు పెట్టిందని, అలాంటి సంతకమే బాలయ్యను కాపాడిందని, ఇలా రకరకాలుగా సోషల్ మీడియా నిండిపోతోంది. అక్కడితో ఆగకుండా డిఎన్ఎ దగ్గరకు వెళ్లే సరికి మరీ బిలో ది బెల్ట్ అటాక్ కూడా చేస్తున్నారు. బాలయ్య ఇంట్లో కాల్పుల టైమ్ లో వచ్చిన వార్తల కటింగ్ లు అన్నీ బయటకు తీస్తున్నారు. మరీ దారుణమైన కామెంట్లు పెడుతున్నారు.
గతంలో బాలయ్య సినిమాల్లో పరుచూరి బ్రదర్స్ మాంచి పవర్ ఫుల్ డైలాగులు రాసారు. అప్పట్లో సోషల్ మీడియా లేకపోవచ్చు. కానీ ఇలా ఎప్పడూ ఇంతలా కౌంటర్ విమర్శలు రాలేదు. ఇదంతా బుర్రా పుణ్యమే అనుకోవాలి.