గాల్లో ఎగురుతున్న విమానంలో తాగిన మత్తులో ఓ వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. గతేడాది నవంబర్ 26న ఎయిరిండియా విమానంలో జరిగిన ఈ ఘటన తీవ్ర దుమారం రేపింది. దీంతో ప్రభుత్వం, ఎయిరిండియా, పోలీసు విభాగం.. ఇలా అన్నీ కదిలొచ్చాయి. ఎట్టకేలకు అతడ్ని అరెస్ట్ చేశారు.
న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిరిండియా విమానంలో ప్రయాణిస్తోంది బాధిత మహిళ. ఆమె వయసు 70 ఏళ్లు. అదే విమానంలో శంకర్ మిశ్రా కూడా ప్రయాణం చేస్తున్నాడు. అప్పటికే అతడు తాగిన మత్తులో ఉన్నాడు. ఉన్నట్టుండి సడెన్ గా లేచాడు. మహిళ వద్దకు వచ్చాడు, ఆమెపై మూత్ర విసర్జన చేశాడు.
దీంతో మహిళతో పాటు, విమాన సిబ్బంది కూడా అవాక్కయ్యారు. వెంటనే మహిళకు మరో సీటు కేటాయించారు. ఆమెకు మార్చుకోవడానికి దుస్తులు కూడా ఇచ్చారు. అయితే విమానం ల్యాండ్ అయిన తర్వాత ఈ విషయాన్ని దాచిపెట్టడానికి ప్రయత్నించారని సదరు మహిళ ఆరోపించింది.
పైగా మత్తు దిగిన శంకర్ మిశ్రా కూడా రాజీ కొచ్చాడని, తన చేతిలో డబ్బులు పెట్టే ప్రయత్నం చేశాడని ఆమె తెలిపింది. విమానయాన సిబ్బంది అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అతడు ఎంచక్కా ఎయిర్ పోర్ట్ నుంచి వెళ్లిపోయాడని ఆరోపించింది.
జరిగిన ఘటనపై టాటా గ్రూప్ ఛైర్మన్ కు ఆమె లేఖ రాశారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై సమగ్ర దర్యాప్తు మొదలైంది. బుకింగ్స్, సీసీటీవీ ఫూటేజ్ ఆధారంగా ఆ వ్యక్తిని శంకర్ మిశ్రాగా గుర్తించారు పోలీసులు.
విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే శంకర్ మిశ్రా పరారయ్యాడు. తన మొబైల్ ను ఆపేశాడు. అయితే సోషల్ మీడియాలో అతడు యాక్టివ్ గా ఉన్న విషయాన్ని గుర్తించిన పోలీసులు, ఆ దిశగా దర్యాప్తు చేసి, బెంగళూరులో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే ఢిల్లీకి తరలించారు.
ఇంతకీ శంకర్ మిశ్రా ఎవరు?
34 ఏళ్ల శంకర్ మిశ్రా.. అమెరికాకు చెందిన ఫైనాన్స్ కంపెనీ వెల్స్ ఫార్గోలో వైస్ ప్రెసిడెంట్ స్థాయిలో ఉన్నాడు. విమాన ప్రయాణాలు, బిజినెస్ క్లాస్ ఇతడికి కొత్త కాదు. కానీ ఇతడు చేసిన పని మాత్రం అత్యంత చెత్త పని అంటూ వ్యాఖ్యానించింది సదరు సంస్థ. మిశ్రాను వెంటనే విధుల్లోంచి తొలిగిస్తున్నట్టు ప్రకటించింది.
ఎయిరిండియా సిబ్బందిపై వేటు..
అటు ఎయిరిండియా కూడా జరిగిన ఘటనపై సమగ్ర అంతర్గత దర్యాప్తుకు ఆదేశించింది. సిబ్బంది తప్పు కూడా ఉన్నట్టు ప్రాధమికంగా నిర్థారించింది. వెంటనే ఐదుగుర్ని విధుల నుంచి పక్కనపెట్టింది. నలుగురు క్యాబిన్ సిబ్బందితో పాటు పైలట్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసి, తాత్కాలికంగా విధుల నుంచి తప్పించింది. పూర్తిస్థాయిలో దర్యాప్తు ముగిసేంతవరకు వీరిని తిరిగి విధుల్లోకి తీసుకోమని తెలిపింది.
జరిగిన ఘటనపై బాధ వ్యక్తం చేసిన ఎయిరిండియా.. ఇకపై తమ సిబ్బందికి మరింత తర్ఫీదు ఇస్తామని, విమానాల్లో మద్యం సేవల విధానాన్ని కూడా మరోసారి సమీక్షిస్తామని తమ ప్రకటనలో తెలిపింది.