ఏపీ రాజకీయాల్లో సినిమ రంగం ప్రమేయం గురించి ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు. సినిమా అభిమానమే ప్రాతిపదికగా రాజకీయం పాతదే. అయితే సినిమా హీరోల రాజకీయం ప్రస్తుతానికి మసకబారింది. సినిమాల్లో వీరవిహారం చేసే హీరోలను రాజకీయంగా ఆదరించేసి, సీఎంగా కూర్చోబెట్టేంత సీన్ ఇప్పుడు లేదు. చిరంజీవికే ఈ భంగపాటు ఎదురైంది. పవన్ కల్యాణ్ ఒకటి రెండు చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. గుడ్డిలో మెల్లగా బాలకృష్ణ మాత్రం ఎమ్మెల్యేగా కొనసాగగలుగుతున్నాడు.
ఆ సంగతలా ఉంటే.. వీరసింహారెడ్డి విజయం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అవసరాల్లో ఒకటిగా మారింది. బాలకృష్ణ సినిమా విజయం సాధిస్తే తెలుగుదేశం పార్టీ వీరాభిమానుల్లో అయినా కాస్త ఊపు వస్తుందనేది వారి ఆశ. ఇప్పటికే బాలకృష్ణ సినిమాలో ఇన్ డైరెక్టుగా డైలాగులు పెట్టుకుని మురిసిపోతున్నారు. మరి ఇలాంటి సినిమాలు గనుక ఫెయిల్యూర్ అయితే అది మరింత భంగపాటు అవుతుంది కూడా!
ఇక ఒంగోలులో ఈ సినిమా కార్యక్రమం విజయవంతం చేయడానికే ప్రకాశం జిల్లా టీడీపీ యూనిట్ గట్టిగా పని చేసిందని సమాచారం. ఈ కార్యక్రమానికి టీడీపీ కార్యకర్తలను తరలించే పని కూడా ఒంగోలు టీడీపీ నేత దామచర్ల జనార్ధన్ తీసుకున్నట్టుగా భోగట్టా.
అలాగే ఈ కార్యక్రమానికి పాసుల వ్యవహారం అంతా దామచర్ల ఆధ్వర్యంలోనే సాగిందట. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో వీధివీధినా ఈ పాసుల పంపిణీ జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ తరహాలో వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను విజయవంతం చేయడానికి తెలుగుదేశం నేతలు తంటాలు పడ్డారు. మరి రేపు సినిమా టికెట్లను పంచే బాధ్యతను కూడా నియోజకవర్గాల వారీగా టీడీపీ నేతలు తీసుకోగలరో లేదో!