బొమ్మను బాబు చెంతకు చేర్చిన ఇండియన్ రైల్వే

రైలులో విలువైన వస్తువులు పోగొట్టుకుంటేనే ఆశలు వదిలేసుకుంటారు చాలామంది. అలాంటిది అది ఓ చిన్న ప్లాస్టిక్ బొమ్మ. రైలు దిగేటగప్పుడు దాన్ని మరిచిపోయిన పిల్లవాడు ఇంటికొచ్చాక విలవిల్లాడుతుంటే తల్లిదండ్రులు ఏమీ చేయలేకపోయారు. కనీసం దాని…

రైలులో విలువైన వస్తువులు పోగొట్టుకుంటేనే ఆశలు వదిలేసుకుంటారు చాలామంది. అలాంటిది అది ఓ చిన్న ప్లాస్టిక్ బొమ్మ. రైలు దిగేటగప్పుడు దాన్ని మరిచిపోయిన పిల్లవాడు ఇంటికొచ్చాక విలవిల్లాడుతుంటే తల్లిదండ్రులు ఏమీ చేయలేకపోయారు. కనీసం దాని గురించి ఫిర్యాదు కూడా చేయాలనే ఆలోచన వాళ్లకు రాలేదు. ఎందుకంటే అదొక సాధారణమైన బొమ్మ. కానీ కాసేపటికే రైల్వే అధికారులు వారిని వెదుక్కుంటూ ఇంటికొచ్చారు. ఆ బొమ్మను బాబు చేతిలో పెట్టారు. పిల్లాడు సంతోషంతో ఎగిరి గంతేశాడు, తల్లిదండ్రులు ఆశ్చర్యంతో కళ్లుపెద్దవి చేశారు.

ఇంతకీ ఏం జరిగింది..?

ఆ పిల్లవాడి పేరు అద్నాన్. వయసు ఏడాదిన్నర. బొమ్మ కావాలని మారాం చేస్తుంటే తల్లిదండ్రులు ఓ ట్రక్కు బొమ్మ కొనిచ్చారు. కాసేపటికే ఆ బొమ్మతో అద్నాన్ కి అనుబంధం ఏర్పడింది. అది ఎవ్వరికీ ఇచ్చేవాడు కాదు, ఎవరు తీసుకున్నా ఊరుకునేవాడు కాదు. తల్లిదండ్రులతో కలసి అద్నాన్ సికింద్రాబాద్ లో అగర్తలా ఎక్స్ ప్రెస్ ఎక్కాడు. రైలు బోగీలో కూడా బొమ్మతో ఆడుకున్నాడు. రైలు బీహార్ లోని కిషన్ జంగ్ స్టేషన్ చేరుకున్న తర్వాత ఆ కుటుంబం దిగిపోయింది. కానీ బొమ్మను మాత్రం వారు మరచిపోయారు.

అద్నాన్ బొమ్మతో ఆడుకోవడం, ఆ తర్వాత వారు బొమ్మను మరచిపోయి వెళ్లిపోవడం తోటి ప్రయాణికుడు గమనించాడు. ఆయన పేరు విభూతి భూషణ్ పట్నాయక్, ఆర్మీలో హవాల్దార్ గా పనిచేస్తున్నారు. ఆ బొమ్మను ఎలాగైనా అద్నాన్ వద్దకు చేర్చాలనుకున్నారు విభూతి భూషణ్. రైల్వే హెల్ప్ లైన్ నెంబర్ కి కాల్ చేసి విషయం చెప్పారు.

బొమ్మను ఇలా ఇంటికి చేర్చారు..

హెల్ప్ లైన్ కి ఫోన్ చేశారు కానీ, రైల్వే అధికారులు సీరియస్ గా పట్టించుకుంటారా లేదా అనే విషయంలో విభూతి భూషణ్ కి కూడా అనుమానం ఉంది. కానీ రైల్వే అధికారులు దీన్ని ఓ ప్రత్యేక కేసుగా తీసుకున్నారు. ఆ బొమ్మను పిల్లవాడికి అప్పగించడానికి సిద్ధమయ్యారు. రైలు, న్యూ జల్పాయ్ గురి స్టేషన్లో ఆగిన తర్వాత విభూతి భూషణ్ దగ్గర్నుంచి బొమ్మను కలెక్ట్ చేసుకున్నారు. ఆ తర్వాత అద్నాన్ కుటుంబం అడ్రస్ కనుక్కోవడం కష్టమైంది. అద్నాన్ తల్లిదండ్రులు రిజర్వేషన్ కౌంటర్ లో టికెట్ కొన్నారు. కౌంటర్ కి ఫోన్ చేసి కిషన్ జంగ్ స్టేషన్ కి రిజర్వేషన్ చేసుకున్నవారి వివరాలు తీసుకున్నారు. ఆ పేర్లను రిజర్వేషన్ చార్ట్ తో సరిపోల్చుకున్నారు.

అద్నాన్ తల్లిదండ్రులు మోహిత్‌ రజా, నస్రీన్‌ బేగం.. పశ్చిమబెంగాల్‌ లోని ఉత్తర్‌ దినాజ్‌ పూర్‌ జిల్లా ఖాజీ గ్రామంలో ఉంటున్నట్టు గుర్తించారు. వారి ఇంటికి వెళ్లి మరీ చిన్నారికి బొమ్మను అందజేశారు. ఆ బొమ్మను చూసి అద్నాన్ కేరింతలు కొట్టాడు. పిల్లవాడి సంతోషాన్ని చూసి తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు.

ఆ బొమ్మ కోసం ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోరనే అనుమానంతో తాము కంప్లయింట్ చేయలేదన్నారు తల్లిదండ్రులు. తాము ఫిర్యాదు చేయకపోయినా నేరుగా ఇంటికి బొమ్మను తీసుకొచ్చి ఇచ్చినందుకు రైల్వే అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. కేవలం పిల్లాడి కళ్లల్లో ఆనందం కోసం రైల్వే శాఖ ఈ పని చేసింది.