సాధారణంగా కవలలు నిమిషాల వ్యవధిలో పుడతారు. లేదా గంటల వ్యవథిలో పుడుతుంటారు. కానీ ఇక్కడ ఇద్దరు కవలలు మాత్రం ఏడాది తేడాతో పుట్టారు. ఒకరు 2022లో పుడితే, మరొకరు 2023లో పుట్టారు.
అమెరికాకు చెందిన ఓ జంట 6 నిమిషాల తేడాలో కవలలకు జన్మనిచ్చింది. అయితే ఆ 6 నిమిషాల్లోనే ఏకంగా పుట్టిన సంవత్సరం మారిపోయింది. టెక్సాస్ కు చెందిన 37 ఏళ్ల జో స్కాట్, పురిటి నొప్పులతో హాస్పిటల్ లో చేరింది.
డిసెంబరు 31 రాత్రి 11:55 గంటలకు ఆమె తన మొదటి కుమార్తె అన్నీ జోకి జన్మనిచ్చింది. 6 నిమిషాల తర్వాత అన్నీ జో సోదరి ఎఫీ రోజ్ జనవరి 1వ తేదీ ఉదయం 12:01 గంటలకు జన్మించింది. ఇలా రెండు వేర్వేరు సంవత్సరాల్లో స్కాట్ కు కవలలు జన్మించారన్నమాట.
ఇకపై తన ఇద్దరు పిల్లల పుట్టినరోజులు విభిన్నంగా జరుపుతామని తెలిపింది స్కాట్. ముందు పుట్టిన బిడ్డకు డిసెంబర్ 31న పుట్టినరోజు జరుపుతామని, ఆ రోజున పాత ఏడాదికి వీడ్కోలు పలుకుతామని.. ఇక రెండో బిడ్డకు జనవరి 1న పుట్టినరోజు సెలబ్రేట్ చేస్తూ, కొత్త ఏడాదికి స్వాగతం తెలుపుతామని ప్రకటించింది.