ఒంగోలులో జరిగిన వీరసింహారెడ్డి ప్రీరిలీజ్ ఈవెంట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి పేరు వినిపించింది. కార్యక్రమం విజయవంతం జరగడానికి ఆయన సహకారం అందించారని వీరసింహారెడ్డి దర్శకుడు గోపిచంద్ మలినేని తన ప్రసంగం ముగింపులో బాలినేని ప్రస్తావన తీసుకు వచ్చారు.
ఒంగోలు ప్రాంతానికే చెందిన గోపిచంద్ మలినేని తన సొంతూళ్లో తన సినిమా ఫంక్షన్ పెట్టుకోవాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్టుగా ఉన్నాడు. ఈ క్రమంలో బాలకృష్ణతో భారీ సినిమాను రూపొందించిన నేపథ్యంలో, సొంత ఊళ్లో తన సినిమా ఫంక్షన్ పెట్టుకోవడం పట్ల చాలా ఉత్సాహంతో ఉన్నట్టున్నాడు. అయితే ఈ ఫంక్షన్ కు అనుమతులు అంత తేలికగా లభించలేదని తెలుస్తోంది.
ఇలాంటి నేఫథ్యంలో.. బాలినేని శ్రీనివాసరెడ్డి వద్దకు వెళ్లి అనుమతుల విషయంలో విన్నవించుకున్నట్టుగా ఉన్నాడు దర్శకుడు. దర్శకుడి కోరిక మేరకు ఒంగోలులో సినిమా సభకు అనుమతులు ఇవ్వాలని హోం శాఖపై బాలినేని ఒత్తిడి తీసుకువచ్చినట్టుగా తెలుస్తోంది.
ఇలా గోపిచంద్ మలినేని జీవిత లక్ష్యాన్ని నెరవేర్చడంలో బాలినేని సాయం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని స్థానిక నేతకు లోకల్ డైరెక్టర్ థ్యాంక్స్ చెప్పుకున్నాడు. మరి సినిమాలోనేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెటైర్లు వేసుకుని, ఫంక్షన్ల వరకూ వచ్చేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకే థ్యాంక్సులు చెప్పుకోవాల్సి వస్తున్నట్టుంది!