వ్యాపారంలో ఓ కీలక సూత్రం ఏమిటంటే ఎదుటివాడి బలహీనతను మన బలంగా మార్చుకోవడం అన్నది. తెలుగునాట మీడియా ఫైట్ లో ఇప్పుడు ఇదే జరుగుతోందని జర్నలిస్ట్ సర్కిళ్లలో వినిపిస్తోంది. కరోనా నేపథ్యంలో ఈనాడును చుట్టుముడుతున్న కొన్ని సమస్యల నేపథ్యంలో ముందుకు దూసుకుపోవాలని ఆంధ్రజ్యోతి ప్రయత్నిస్తోందన్నది ఆ వార్తల సారాంశం.
ఇంతకీ విషయం ఏమిటంటే కరోనా లాక్ డౌన్ కారణంగా కొన్ని రోజులు పత్రికల ప్రింటింగ్ ఆగిపోయింది. ఆ తరువాత మళ్లీ ప్రింటింగ్ ప్రారంభమైనా చాలా పత్రికలు అరకొరగా ప్రింట్ చేస్తున్నాయి. కొన్ని పత్రికలు ప్రింటింగ్ ప్రస్తుతానికి నిలిపివేసాయి. ఇలాంటి నేపథ్యంలో అగ్రశ్రేణి దినపత్రిక ఈనాడుకు చాలా సమస్యలు చుట్టుముట్టాయి.
ఒకటి ప్రకటనల ఆదాయం తగ్గడం, రెండు న్యూస్ ప్రింట్ ను జాగ్రత్తగా వాడుకోవాల్సి రావడం. ఈ రెండు సమస్యలను ఒకేసారి అధిగమించేందుకు వీలుగా చాలా పత్రికల మాదిరిగానే ఈనాడు కూడా వీలయినంత వరకు పేజీలు తగ్గించి, ఖర్చులు తగ్గించి, న్యూస్ ప్రింట్ ను ఆదా చేస్తోంది. ఎప్పుడయితే ప్రకటనలు తగ్గాయో, పత్రిక ప్రింట్ ఖర్చుకు రాబడికి మధ్య తేడా పెరుగుతుందో నష్టాలు వచ్చే ప్రమాదం వుంది.
అందుకే అటు రవాణా సమస్యలు, ఇటు ప్రింట్ సమస్యలు, ఇంకా ఇతరత్రా సమస్యలు అధిగమించేందుకు చిన్న చిన్న గ్రామాలకు పది కాపీలు, ఇరవై కాపీలు వున్న చోట్లకు పత్రికను పంపించడం తగ్గింది. కరోనా టైమ్ లో బిల్లులు రాకపోవడంతో, బిల్లలు కట్టని వారికి పత్రికలను నిర్మొహమాటంగా ఆపేయడం అన్నది ఈనాడు పద్దతి. కానీ ఆంధ్రజ్యోతి మాత్రం ఈ విషయంలో కాస్త ఎక్కువ లిబరల్ గా వుంటుంది.
ఈ అవకాశాన్ని అంది పుచ్చుకునేందుకు ఆంధ్రజ్యోతి ప్రయత్నిస్తోందన్నది జర్నలిస్ట్ వర్గాల బోగట్టా. ఇదే సమయంలో ఖర్చు అయితే అయింది, ఈనాడు వెళ్లని ఊళ్లకు జ్యోతి పత్రికను కచ్చితంగా వెళ్లేలా చేయడం, బిల్లులు గట్టిగా పీకల మీద కూర్చుని వసూలు చేయడం అన్న పద్దతి పాటించకుండా వుండడం, అవకాశం వుంటే ఈనాడు వెళ్లని ఊళ్లలో చందాదారులకు జ్యోతి అందేలా చేయడం వంటి బిజినెస్ టెక్నిక్ లు వాడుతున్నట్లు తెలుస్తోంది.
ఇది ఇప్పుడు కాస్త చిన్నగా వున్నా. భవిష్యత్ లో ఈనాడుకు కాస్త తలనొప్పిగా మారే ప్రమాదం వుంది. ఎందుకంటే ఈనాడు-జ్యోతి పత్రికలు లైక్ చేసేవారిలో తెలుగుదేశం హార్డ్ కోర్ జనాలు వుంటారు. వారికి కంటెంట్ విషయంలో జ్యోతి హార్డ్ హిట్టింగ్ అలవాటైతే, ఈనాడు సాఫ్ట్ టచ్ రుచించకపోయే ప్రమాదం వుంది. అందువల్ల ఆఫ్టర్ కరోనా తెలుగునాట మీడియా వ్యవహారాలు చాలా మారే అవకాశం కనిపిస్తోంది.