బహుశా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం కేసులో సీబీఐ వాళ్లు, ఈడీ వాళ్లు ముందుగా విచారించాల్సింది బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ని కాబోలు! సుశాంత్ మరణానికి కారణాలపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. సుశాంత్ ది హత్య అని గత కొన్నాళ్లుగా స్వామి వాదిస్తూ ఉన్నారు.
ఈ క్రమంలో హంతకులు ఎవరనే అంశం మీద కూడా ఆయన రన్నింగ్ కామెంట్రీ కొనసాగుతూ ఉంది. దుబాయ్ డ్రగ్ మాఫియాతో సంబంధాలున్న ముంబైలోని దాదాలు సుశాంత్ ను హత్య చేశారని స్వామి అంటున్నారు. ఈ క్రమంలో ఆయన మరో విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.
మరణించిన రోజున సుశాంత్ ముందుగా ఒక డ్రగ్ డీలర్ ను కలిశాడని స్వామి చెబుతున్నారు. ఆ డ్రగ్ డీలర్ పేరు కూడా చెప్పి.. ఆ వ్యక్తిని సుశాంత్ ఆ రోజు పగలు కలిశాడని, ఆ రాత్రికే సుశాంత్ హత్యకు గురయ్యాడని స్వామి అంటున్నారు.
ఇలా సీబీఐ కన్నా ముందే..సర్వ సమాచారాలనూ సుబ్రమణ్యస్వామి విడతలా వారీగా వివరిస్తున్నారు. అది కూడా ఒకే రోజు ఆయన అన్ని విషయాలనూ చెప్పడం లేదు. అప్పుడప్పుడు ఒక్కో విషయాన్ని చెబుతూ ఉన్నారు. ఇదేదో టీవీ చానళ్ల వ్యవహారంలా అనిపిస్తోంది.
సుశాంత్ మరణంపై తనకున్న అనుమానాలను, తన వద్ద ఉన్న ఆధారాలనూ స్వామి సూటిగా ప్రస్తావించడం లేదు. అప్పుడప్పుడు ఒక్కో విషయాన్ని చెబుతున్నారు. సుశాంత్ ది హత్య అని.. అలాగే సునంద పుష్కర్, శ్రీదేవి వాళ్లవి కూడా హత్యలే అని.. వాటికీ, సుశాంత్ హత్యకూ సంబంధం ఉందని.. దీని వెనుక డ్రగ్ మాఫియా ఉందన్నట్టుగా స్వామి అంటున్నారు. అంతే కాదు.. ఈ ఘటనలపై ఇజ్రాయెల్ కు చెందిన మొసాద పరిశోధించాలని కూడా స్వామి అంటున్నారు!