అఖిల్ అక్కినేని-సురేందర్ రెడ్డి కాంబినేషన్ సినిమా మ్యూజికల్ చైర్స్ ఆట ఆడుతోంది. ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ అనిల్ సుంకర దగ్గరకు వచ్చి ఆగింది. అయితే ఆయన చేతిలో మరో రెండు ప్రాజెక్టులు వున్నాయి. మెగాస్టార్ తో మెహర్ రమేష్ డైరక్షన్ లో ఒకటి. అజయ్ భూపతితో శర్వానంద్ మహాసముద్రం మరొకటి. అందువల్ల మూడు ప్రాజెక్టులు ఒకేసారి హ్యాండిల్ చేయగలనా? అన్న అనుమానంతోనూ, ముందుగా మెగాస్టార్ సినిమా వ్యవహారం ఫైనల్ కావాలన్న ఆలోచనతోనూ అనిల్ సుంకర పైకి ఏదీ వెల్లడించలేదు.
ఇంతలో వార్తల కోసం అల్లాడే జనాలు ఈ ప్రాజెక్టును 14రీల్స్ ప్లస్ టేకప్ వార్తలు పుట్టుకువచ్చాయి. దీంతో అనిల్ సుంకర ఈ ప్రాజెక్టు వేయబుల్ కాదని వదిలేసారా? అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే సురేందర్ రెడ్డి 12 కోట్ల మేరకు రెమ్యూనిరేషన్ డిమాండ్ చేస్తున్నారు. టోటల్ ప్రాజెక్టు కాస్ట్ నలభై కోట్లు అవుతుందనే విషయం నిర్మాతలను భయపెడుతోందని బోగట్టా.
ఇలాంటి నేపథ్యంలో అఖిల్ ప్రాజెక్టు ఇలా అనిల్ సుంకర, ఆయన సన్నిహిత బ్యానర్ 14రీల్స్ ప్లస్ మధ్య దోబూచు లాడుతోందా? లేక ముందే అనుకున్నట్లు అనిల్ సుంకరనే నిర్మాతనా? బన్నీవాస్ లాంటి నిర్మాత మధ్యవర్తిత్వం వహించి ఈ ప్రాజెక్టును అనిల్ సుంకర కు సెట్ చేసారని తెలుస్తోంది. అలాంటి ప్రాజెక్టును అనిల్ సుంకర వదిలేస్తారా? అన్నది ఇంకో అనుమానం.