వివాదాస్పద, సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన మర్డర్ సినిమా విడుదలకు నల్లగొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు బ్రేక్ వేసింది. కేసు విచారణ పూర్తయ్యే వరకు సినిమా విడుదల నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సినిమాకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్టైంది.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో రెండేళ్ల క్రితం పెరుమాళ్ల ప్రణయ్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. ఇది పరువు హత్య. అప్పట్లో ఈ హత్య తీవ్ర సంచలనం కలిగించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన అమృత తండ్రి కూడా ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దళిత యువకుడైన ప్రణయ్ హత్యను కథా వస్తువు చేసుకుని వర్మ ‘మర్డర్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీనికి ‘కుటుంబ కథా చిత్రమ్’ అనే ట్యాగ్‌లైన్ పెట్టడం గమనార్హం. ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్, రెండు పాటలు కూడా విడుదలయ్యాయి.
ఈ సినిమాపై ప్రణయ్ భార్య అమృతతో పాటు వివిధ వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయినప్పటికీ వర్మ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఈ నేపథ్యంలో అమృత నల్లగొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ఎస్సీ ఎస్టీ కోర్టు సోమవారం కీలక ఆదేశాలిచ్చింది. కేసు విచారణ పూర్తయ్యే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా విడుదల చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అయితే ఈ ఉత్తర్వులపై హైకోర్టుకు వెళ్లనున్నట్టు వర్మ తరపు న్యాయవాది తెలిపారు.
ఈ సినిమాలో శ్రీకాంత్ అయ్యంగార్, సాహితి తదితరులు ప్రధాన పాత్రలను పోషించారు. సినిమాలో ఓ పాటను వర్మ పాడడం విశేషం. దాదాపు రెండు గంటల పాటు సినిమా ఉండనుంది. అలాగే థియేటర్లు తెరిచిన తర్వాతే ఈ సినిమాను విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా న్యాయ వివాదంలో ఇరుక్కోవడంపై ఉత్కంఠ నెలకొంది.