హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం కంటే.. దానిపై టీఆర్ఎస్ విశ్లేషణ మరింత పరువు తక్కువగా ఉంది. బీజేపీ, కాంగ్రెస్ కలసిపోయాయి అందుకే తాము ఓడిపోయామంటూ చౌకబారు సమర్థింపులు చేసుకుంటున్నారు నేతలు.
స్వయంగా హరీష్ రావే అలాంటి వ్యాఖ్యలు చేశారు, కౌశిక్ రెడ్డి, బాల్కసుమన్ ఇలా అందరూ ఇప్పుడిదే పల్లవి అందుకుంటున్నారు.
అవును కలిసిపోయాయి.. అయితే ఏంటి..?
తెలంగాణ సాధన కోసం కాంగ్రెస్, బీజేపీ లోక్ సభలో కలిస్తే తప్పు లేదు కానీ, హుజూరాబాద్ లో కలిస్తే తప్పా..? కాంగ్రెస్ నాయకుల్ని కేసీఆర్ కలిపేసుకోవచ్చు, కానీ కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీకి మద్దతిస్తే తప్పా..? టీఆర్ఎస్ సకలపార్టీ సమ్మేళనం, కానీ ఇతర పార్టీలు మాత్రం ఒకరికొకరు దూరంగా ఉండాలా..? సామాజిక మాధ్యమాల ద్వారా ఇలాంటి ప్రశ్నలు టీఆర్ఎస్ పైకి ఎక్కుపెడుతున్నారు విపక్ష నేతలు.
హుజూరాబాద్ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అధికార టీఆర్ఎస్ పార్టీ. కేవలం ఆ ఎన్నిక సందర్భంలోనే దళితబంధు వంటి పథకాలు ప్రకటించింది. కూడికలు, తీసివేతలు, పదవులు.. ఇలా రకరకాల విన్యాసాలు చేసింది.
ఎన్నికలకు ముందు కూడా బీజేపీ, కాంగ్రెస్ కలసిపోయాయంటూ ప్రచారం చేశారు. వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు, మాకు ఓటు వేయండి అంటూ ప్రాధేయపడ్డారు. పోనీ అదే నిజమైతే.. కాంగ్రెస్, బీజేపీ కలసిపోతే టీఆర్ఎస్ ఓడిపోతుందని తెలిస్తే.. ముందే నష్టనివారణ చర్యలు చేపట్టాల్సింది కదా. అది వదిలేసి ఓటమిని కవర్ చేసుకోడానికి నానా తంటాలు పడుతున్నారు టీఆర్ఎస్ నేతలు.
2023లో కూడా లోపాయికారీ పొత్తు ఉంటే ఏం చేస్తారు..?
ఈ ఎన్నిక హుజూరాబాద్ కి మాత్రమే పరిమితం అయింది. ఫలితం తేడా వచ్చింది. రేపు 2023లో కూడా బీజేపీ, కాంగ్రెస్ లోపాయికారీగా కలిస్తే అప్పుడు టీఆర్ఎస్ ఏం చేస్తుంది..? ముందే ఓటమిని ఒప్పుకుంటుందా..? మొత్తమ్మీద ఓటమిని హుందాగా స్వీకరించే దమ్ములేకే టీఆర్ఎస్ నేతలు ఇలా బీజేపీ, కాంగ్రెస్ పై పడి తమని తామే చులకన చేసుకుంటున్నారు టీఆర్ఎస్ నేతలు.
ఎన్నికలకు ముందు కనిపించిన మేకపోతు గాంభీర్యం.. ఇప్పుడు ఒక్క నేతలో కూడా కనిపించకపోవడం విశేషం. కేటీఆర్ నిజంగా అన్నాడో లేదో తెలియదు కానీ.. కుక్కని నిలబెట్టినా గెలుస్తాం అనే మాట ఇప్పుడు మరింత వైరల్ గా మారింది. మరీ అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు బాబూ అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.
మొత్తమ్మీద హుజూరాబాద్ ఎపిసోడ్ కేసీఆర్, టీఆర్ఎస్ పరువుతీసిందనే మాట వాస్తవం. అయితే ఫలితాల తర్వాత నాయకులు మరింతగా తమ అధినేత పరువు, పార్టీ పరువు తీస్తున్నారు. దిస్ ఈజ్ వాస్తవం.