ముగిసిన డెడ్ లైన్.. లైట్ తీసుకున్న కార్మికులు

కేసీఆర్ కు కార్మికులు ఎంత విలువ ఇస్తున్నారో తేలిపోయింది. డెడ్ లైన్ అంటూ కళ్లు పెద్దవి చేసి మరీ కేసీఆర్ ఇచ్చిన వార్నింగ్ ను కార్మికులు లైట్ తీసుకున్నారు. ఎంతలా అంటే.. డెడ్ లైన్…

కేసీఆర్ కు కార్మికులు ఎంత విలువ ఇస్తున్నారో తేలిపోయింది. డెడ్ లైన్ అంటూ కళ్లు పెద్దవి చేసి మరీ కేసీఆర్ ఇచ్చిన వార్నింగ్ ను కార్మికులు లైట్ తీసుకున్నారు. ఎంతలా అంటే.. డెడ్ లైన్ నాటికి కేవలం 208 మంది మాత్రమే విధుల్లో చేరారు. మిగతా వాళ్లంతా సమ్మెలో కొనసాగుతున్నారు. కేసీఆర్ తో తాడోపేడో తేల్చుకోవడానికే రెడీ అయ్యారు.

మంగళవారం అర్థరాత్రిలోపు విధుల్లోకి చేరాలన్న కేసీఆర్ అల్టిమేటమ్ కు అరకొరగానే స్పందన వచ్చింది. 3వ తేదీన 17 మంది, 4న 34 మంది, ఇక ఆఖరి రోజైన నిన్న 157 మంది మాత్రమే విధుల్లో చేరారు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. విధుల్లోకి చేరుతున్నట్టు అంగీకారపత్రాలిచ్చిన వాళ్లలో చాలామంది ఇలా చేరి, అలా మళ్లీ సమ్మెలో జాయిన్ అయ్యారు. మరికొంతమంది డిపోల్లోనే ఉంటూ సహాయ నిరాకరణ స్టార్ట్ చేశారు. సో.. కేసీఆర్ వార్నింగ్ ను కార్మికులు అస్సలు ఖాతరు చేయలేదని అర్థమౌతూనే ఉంది.

ఇప్పటికే 5100 ప్రైవేట్ బస్సులకు పర్మిట్లు ఇచ్చారు ముఖ్యమంత్రి. కార్మికులు విధుల్లోకి రాకపోతే మిగిలిన అన్ని మార్గాల్లో కూడా ప్రైవేటుకు అనుమతి ఇస్తాని, అప్పుడు తెలంగాణలో ఆర్టీసీ అనేదే ఉండదని హెచ్చరించారు. అక్కడితో ఆగకుండా కేబినెట్ నిర్ణయం తీసుకుంటే కోర్టులు కూడా ఏమీ చేయలేవని బెదిరించారు. కానీ ముఖ్యమంత్రి బెదిరింపులు కార్మికులు లొంగలేదు. తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. నిన్నట్నుంచి గ్రామాల్లోకి వెళ్లి, ప్రజలకు సమస్యను అర్థమయ్యేలా వివరిస్తున్నారు. మరోవైపు కార్మిక నాయకులు సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమౌతున్నారు.

ఇటు కేసీఆర్ కూడా వార్నింగ్ అయితే ఇచ్చారు కానీ, మిగతా రూట్లలో కూడా ప్రైవేట్ కు పర్మిట్లు ఇవ్వడానికి జంకుతున్నారు. ఎందుకంటే, ఈ విషయంలో రాష్ట్రప్రభుత్వానికి పూర్తి అధికారం లేదు. కేంద్రం కూడా సహకరించాలి. మరీ ముఖ్యంగా ఉన్నఫలంతా ప్రైవేటీకరణ అంటే సుప్రీంకోర్టు అస్సలు అంగీకరించదు. గతంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ఇలాంటి ప్రయత్నాలు చేసి కోర్టుల్లో చేతులుకాల్చుకున్న ఉదంతాలు ఉన్నాయి. ఇవన్నీ కేసీఆర్ కు తెలియనివి కావు.

అందుకే కార్మికులు కూడా వెనక్కి తగ్గలేదు. తమ సమ్మెను కొనసాగిస్తున్నారు. మరోవైపు ఈ వివాదం కారణం మరో ప్రాణం గాల్లో కలిసిపోయింది. కరీంనగర్ రెండో డిపోకు చెందిన మెకానిక్ కరీంఖాన్ గుండెపోటుతో మరణించారు. దీంతో ఈ నెల రోజుల్లో చనిపోయిన ఆర్టీసీ కార్మికుల సంఖ్య 7కు చేరింది. రేపు హైకోర్టులో ఆర్టీసీ అంశానికి సంబంధించి వాయిదా ఉంది. హైకోర్టు చొరవతోనైనా ఈ సమస్యకు ఓ పరిష్కారం దొరుకుతుందేమో చూడాలి.