తిరుమల శ్రీవారి ఆలయం పూర్వ అర్చకులు రమణ దీక్షితులు మళ్లీ టీటీడీలో భాగమయ్యారు. ఆయనను ఆగమ సలహా మండలి సభ్యునిగా నియమించారు. ఈ మేరకు టీటీడీ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చొరవ మేరకు రమణ దీక్షితులుకు మళ్లీ శ్రీవారి సేవ అవకాశం దక్కిందని స్పష్టం అవుతూ ఉంది.
అనువంశీక అర్చకుడిగా కొనసాగుతున్న రమణ దీక్షితులును చంద్రబాబు నాయుడి ప్రభుత్వం ఇంటికి పంపించింది. ఆయనకు రిటైర్మెంట్ అంటూ ప్రకటించింది. అయితే అనువంశీక అర్చకులకు పదవీ విరమణ ఉండదంటూ రమణ దీక్షితులు వాదించారు. అయితే ప్రభుత్వం పట్టించుకోలేదు.
రమణ దీక్షితులు వెళ్లి అప్పట్లోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ను కలిశారు. తన గోడును వెల్లబోసుకున్నారు. ఇక ఇటీవలే జగన్ ప్రభుత్వం రిటైర్మెంట్ జీవోలను రద్దు చేసింది. అనువంశీక అర్చకులకు రిటైర్మెంట్ ఉండదని స్పష్టమైన ప్రకటన చేసింది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోని అన్ని ఆలయాల్లోనూ ఆ మేరకు నియమాన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఇక రమణ దీక్షితులును ఆయన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని.. ఆగమ సలహా మండలి సభ్యునిగా నియమించారు.