తాము మెత్తబడింది లేదని శివసేన ప్రకటనల మీద ప్రకటనలు చేస్తూ ఉంది. ఎన్సీపీ వాళ్లను, కాంగ్రెస్ వాళ్లను బూచిగా చూపి బీజేపీని బెదిరిస్తోంది శివసేన. ఇక బీజేపీ కూడా తగ్గడం లేదు. ఆర్ఎస్ఎస్ చీఫ్ వద్దకు దేవేంద్ర ఫడ్నవీస్ వెళ్లారు. సమావేశం అయ్యారు. అంతటి వరకే అప్ డేట్స్ ఆగిపోతూ ఉన్నాయి.
ఇప్పటికే శివసేన వాళ్లు కూడా ఆర్ఎస్ఎస్ కు కంప్లైంట్ చేశారు. ఫడ్నవీస్ వెళ్లి ఆర్ఎస్ఎస్ చీఫ్ ను కలిశారు. అయితే వీరి పంచాయితీని తేల్చడానికి సంఘ్ కు కూడా అంత తేలికగా ఉన్నట్టుగా లేదు. అధికారం కోసం ఇరు పార్టీలూ ఎగబడుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి పీఠం తమదంటే తమదని వాదులాడుతూ ఉన్నాయి. బీజేపీ నేతలు మొదట్లో అహంభావంగా మాట్లాడారు. తమను కాదంటే రాష్ట్రపతి పాలనే అంటూ హెచ్చరించారు. అందుకు గడువు కూడా ప్రకటించారు.
అయితే ఆ గడువు దాటిపోయినా.. బీజేపీ వాళ్లు ఇప్పుడు మారు మాట్లాడటం లేదు. శివసేన కూడా ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదని ఫిక్సయినట్టుగా ఉంది. అయితే ఎన్సీపీ నుంచి సేనకు అంత సపోర్ట్ కనిపించడం లేదు. గేమ్ ఆడటానికి కాంగ్రెస్ రెడీగానే ఉన్నట్టుగా ఉంది. అందుకు ఎన్సీపీ కూడా ఓకే చెబితే.. బీజేపీ మరింత ఇరకాటంలో పడుతుంది. ఎన్సీపీ నుంచి కదలిక మొదలైతే.. శివసేన డిమాండ్ల పట్ల బీజేపీ మరింత వేగంగా స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు.