అధికారంలోకి వచ్చి ఎన్నాళ్లో కాలేదు.అయినా ప్రతిపక్షం అస్సలు అవకాశం ఇవ్వడం లేదు. ఏదో ఒక పాయింట్ పట్టకుని నానా యాగీ చేస్తోంది. ఇప్పటి వరకు పట్టుకున్న పాయింట్లు ఏవీ కూడా కొసనెగ్గించలేదు. చాలా ట్రయ్ చేసారు కానీ ఏదీ ఫలితం ఇవ్వలేదు. జనాల్లో స్పందన రాలేదు. ఆఖరికి ఇసుక పాయింట్ దొరికింది.
ఇక్కడ ఇసుక పాయింట్ కాదు అసలు. ఇసుక కారణంగా భవన నిర్మాణ కార్మికులకు పని కరువైంది అన్నది. నిజానికి ఇక్కడ కూడా చిన్న మతలబు వుంది. భవన నిర్మాణ కార్మికులకు పని దొరకనిది కేవలం ఇసుక లేక కాదు. ఇసుక లేమి కూడా ఓ కారణం మాత్రమే.వేరే కారణాలు వున్నాయి.
ఆర్థిక మాద్యం కారణంగా అన్ని వ్యాపారాలు కునారిల్లుతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగం మందగమనంలో వుంది.కొన్ని చోట్ల తిరోగమనంలో వుంది.
అలాగే కొత్త ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ పరంగా జరిగే నిర్మాణ కార్యక్రమాలు, కాంట్రాక్టులు ప్రస్తుతానికి పక్కన పెట్టారు. రోడ్లు, భవనాల మరమ్మతులు కావచ్చు, నిర్మాణాలు కావచ్చు, వివిధ పథకాల కింద చేపట్టే నిర్మాణాలు కావచ్చు జరగడం లేదు.
ఇవన్నీ కలిసి భవన నిర్మాణ కార్మికులకు పనులు తగ్గేందుకు దారి తీసాయి. ఇది దొరికింది ప్రతిపక్షానికి. ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేయాలని డిసైడ్ అయ్యాయి. ప్రతిపక్షాలైన తెలుగుదేశం, జనసేన, భాజపా కలిసి కిందా మీదా చేస్తున్నాయి.
వీటి వెనుక అసలు ఎజెండా కూడా వేరే వుందని రాజకీయ వర్గాలబోగట్టా. జగన్ ఎన్నికల ముందు నుంచి, ఆ తరువాత కూడా కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూనే వున్నారు. అదే విధంగా బిసిల అండతోనే జగన్ అధికారంలోకి వచ్చారు. కాపుల మద్దతు వుంటే వుంటుంది లేకుంటే లేదు అనే ధోరణిలో వెళ్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వైపే కాపులు చాలా వరకు వుంటారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వుంది.
అందుకే కాపు సామాజిక వర్గానికి చెందిన భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కమ్మ సామాజిక వర్గానికి చెందిన తేదేపా అధినేత చంద్రబాబు నాయుడు ముప్పేట దాడి ప్రారంభించారు.
అదే సమయంలో అగ్రశ్రేణి పత్రికలు రెండు కూడా జతకలిసాయి. వాటికీ సామాజిక బంధాలు వున్నాయి. జగన్ ప్రభుత్వంతో ఆర్థిక ఇబ్బందులు వున్నాయి. అందువల్ల ఈ ముప్పేట దాడికి యథాశక్తి కవరేజ్ అందిస్తున్నాయి. దీంతో రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతోందన్న భావన జనాల్లో కలిగించడంలో కిందా మీదా అయిపోతున్నాయి.
జగన్ చేసుకున్నది కొంత
ప్రతిపక్షం చేస్తున్న ముప్పేట దాడికి ప్రతి వ్యూహం రూపొందించడంలో వైఎస్ జగన్ కూడా విఫలమవుతున్నట్లు కనిపిస్తోంది. జగన్ మాత్రమే కేంద్రంగా, జగన్ మాత్రమే నిర్ణయాధికారిగా వున్న వైకాపాలో మరెవరు ఏమీ చేయలేరు. ఏ చేసినా, చేయాలన్నా జగన్ నే చేయాలి. కానీ ఆయన మొండివాడి కన్నా తానే బలవంతుడను అనే రీతిలో, ఇంకా నాలుగేళ్లు వుంది, ఇప్పుడు ఎవరేం చేస్తారు అనే ఆలోచనలో ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది.
ఏం చేసినా, ఎలా చేసినా రాష్ట్రం మొత్తం మీద ఇసుకను సరిగ్గా అందించే సరైన కార్యక్రమాన్ని కూడా అందించలేకపోతున్నారు. వరదలపై నెపం నెట్టడం కొంత వరకు కరెక్ట్ నే కానీ, పూర్తిగా మాత్రం సరికాదు అన్నది వాస్తవం. ఆన్ లైన్ లో ఇసుక ను దళారులే ముందుగా కబ్జా చేస్తున్నారని ఆరోపణలు వున్నాయి. అలాంటి వ్యవహారాలను అరికట్టడానికి తగిన చర్యలను తీసుకోవాల్సి వుంది. జనాలకు ప్రభుత్వం సమస్యలు పట్టవు. తమ సమస్యకు ప్రభుత్వం ఏం చేస్తోంది అన్నదే చూస్తారు. అది గమనింపులోకి తీసుకోవాలి.
దీనికి తోడు చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యంను బదిలీ చేసిన విధానం కూడా ఇదే సమయంలో జరగడం అగ్నికి ఆజ్యం పోసినట్లు అయింది. హిందువులు, బ్రాహ్మణుల ఓటు బ్యాంక్ ను పొందడంలో జగన్ చేసిన కృషి, ఇప్పటి వరకు చేసింది అంతా ఒక్క దెబ్బకు పోయేలా కనిపిస్తోంది. ఎల్వీ సుబ్రహ్మణ్యంను ఎందుకు తప్పించారు అన్నది మొదటి రోజు క్లారిటీ లేదు
కానీ రెండో రోజు మాత్రం దాని వెనుక క్రిస్టియన్ లాబీ వుందన్న ప్రచారం రావడం కాస్త గట్టి దెబ్బే అవుతుంది. అదే కనుక ఊక్క ఆరు నెలలు ఆయనను భరించి వుంటే ఏ సమస్యా వుండేది కాదు. లేదూ బ్రాహ్మిణ్ కార్పొరేషన్ పదవి లాంటి దాన్ని ఆయనకు ముందే అదనపు బాధ్యతలకుగా అప్ప చెప్పి, బదిలీ చేసి వుంటే కాస్త ఊరట వుండేది.
భాజపాకు మద్దతు ఇచ్చే మేధావి వర్గం మొన్నటి వరకు జగన్ గురించి ఏమీ మాట్లాడలేదు కానీ, ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ విషయంలో జగన్ ను పూర్తిగా తప్పు పడుతోంది. ఇది జగన్ కు కేంద్రానికి మధ్య దూరం పెంచే అవకాశం వుంది.
ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ వ్యవహారాన్ని క్రిస్టియన్ సంఘాలు సంబరాలు చేసుకుంటున్నాయని వార్తలు రావడం కచ్చితంగా జగన్ కు మైనస్ అవుతుంది. దేవాలయాల్లో అన్య మతస్థులను తప్పించే పని కొంతకాలంగా జరుగుతుంటే అది జగన్ ఖాతాలోకి వెళ్లింది.
కానీ సుబ్రహ్మణ్యం బదిలీకి అదే కారణం అని తెలిసేసరికి, జగన్ ఖాతాకు మైనస్ పడుతోంది. కేవలం ఆరు నెలల సర్వీసు వుండగా, వీలయినంత పద్దతిగా తప్పించడమో, లేదా ఆరు నెలలు భరించడమో చేయకుండా, జగన్ ఇలా చేయడం కచ్చితంగా అతనికి మైనస్ అవుతుంది. బలమైన మీడియా ప్రచారం ఒక్కోసారి పని చేయకపోయి వుండొచ్చు. కానీ పని చేసిన సందర్భాలు ఎక్కువగా వున్నాయి.
డబ్బులు ఇచ్చేస్తున్నా, జనాలు అంతా ఇవి పట్టించుకోరు అన్నది కూడా పాయింట్ కాదు. చంద్రబాబు కూడా డబ్బులు పంచారు. అన్న క్యాంటీన్లు పెట్టారు. చంద్రన్న కానుకలు ఇచ్చారు. పసుపు కుంకుమ, రైతు భరోసా ఇచ్చారు. అన్నీ ఇచ్చినా, అవినీతి అన్న ప్రచారం కూడా జరిగింది. జనంలోకి వెళ్లింది.
2014లో జగన్ అనుభవరాహిత్యం అన్నది విపరీతంగా ప్రచారం జరిగింది. జనం అది నమ్మారు కూడా. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కూడా అలాగే వున్నాయి. ఇప్పడు జనానికి అదీ ఇదీ కలిపి ముడిపెట్టి చూసుకునే పరిస్థితి రాకూడదు. జగన్ తెచ్చుకోకూడదు. ఎందుకంటే చాలా ఎన్నికలు జరగాల్సి వుంది. అవన్నీ ఎన్నాళ్లు పక్కన పెడతారన్నది జగన్ కే తెలియాలి.
జనాల్లో మెలమెల్లగా వచ్చే అసంతృప్తి లేదా ఓ అభిప్రాయం అన్నది ఇప్పటికిప్పుడు కనిపించదు. కానీ జాగ్రత్త పడకపోతే అది ఇంతై..ఇంతింతై అన్నట్లు తయారవుతుంది.
స్వంత పార్టీ వ్యవహారం
జనాలు మెజారిటీ ఇచ్చారు, జగన్ గట్టిగా నిలబడతారు కాబట్టి, పార్టీ జనాలు ఇప్పుడు ఏమీ మాట్లాడడం లేదు. కానీ కోట్లు ఖర్చుచేసి గెల్చిన నాయకులు తమ మూతులు కట్టేస్తుంటే కక్క లేక మింగలేక వున్నారు. అది వాస్తవం. పనులు లేవు. అవినీతికి అల్లంత దూరం వుండాలని జగన్ ఆదేశం. ఇక రాజకీయ నాయకులకు రికవరీ ఎలా? అందువల్ల వారిలో కూడా అసంతృప్తి రగులుకునే ప్రమాదం వుంది.
జనాలకు డబ్బులు ఇస్తున్నాం. అందువల్ల ఆపద కాలంలో వాళ్లు అండగా వుంటారు అని అనుకోవడం భ్రమ. జనాలకు షార్ట్ టెర్మ్ మెమరీ లాస్. అది రాజకీయ నాయకులకు ప్లస్సూ..మైనస్సూ కూడా.
అందువల్ల జగన్ అంతా తను అనుకున్నట్లే జరిగిపోతుంది అని అనుకుంటూ , ఆ విధంగా ముందుకు పోతే కష్టం అవుతుంది. ముప్పేట దాడిని తట్టుకునే వ్యూహాలు రచించుకోవాలి. తన మొండి వైఖరిని తగ్గించుకోవాలి. ఎందుకంటే జగన్ సమరం, మెజారిటీ మీడియాతొ, రెండు ప్రధాన సామాజిక వర్గాలతో, వీటికి అదనంగా ఎవరు జతకలిసినా ప్రమాదఘంటికలు మోగుతాయని గమనించాలి. ఆ ఎవరు అన్నది ఎవరైనా కావచ్చు. కేంద్రంలో వున్న భాజపాతో సహా.
అందుకే జగన్…తస్మాత్ జాగ్రత్త
ఆర్వీ