వైఎస్సార్ తనయ షర్మిల కాంగ్రెస్‌తో ప్రయాణం ఇక లాంఛనమే. ఏ రూపంలో ఉంటుంది? ఆమె చేరిక వల్ల తెలంగాణ-ఏపీలో రాజకీయ సమీకరణాలు, ఆమె భవితవ్యం ఎలా ఉంటుందనే విషయమై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌లో ఆమె వేసే మలి అడుగులు అన్నింటికి సమాధానంతో బాటు ఆమె భవిష్యత్‌కు పునాది అని చెప్పక తప్పదు.
తెలుగు రాజకీయాలలో షర్మిల సంచలనం
వైఎస్ తనయగానే షర్మిల అందరికీ తెలుసు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అరెస్టు తర్వాత షర్మిల పాదయాత్ర చేశారు. తొలి రోజే షర్మిల ప్రసంగం, ఆమె వ్యవహార శైలి చూపిన తర్వాత షర్మిల రాజకీయ నాయకురాలిగా రాణిస్తారనే నమ్మకం కలిగింది. 2014 కు ముందు పాదయాత్ర 2014, 19 ఎన్నికల ప్రచారాల్లో షర్మిలకు ఏపీలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆమాట కొస్తే ఖమ్మం జిల్లాలో వైసీపీ అభ్యర్థుల గెలుపులో కీలక పాత్ర పోషించారు. వర్తమాన రాజకీయాలలో ప్రజలను షర్మిలలా ప్రభావితం చేసిన మహిళ మరొకరు లేరు అంటే అతిశయోక్తి లేదు.
కాంగ్రెస్‌లో షర్మిల చేరికతో ఇద్దరికీ ప్రయోజనం
ఒక వ్యక్తి లేదా పార్టీ తీసుకునే రాజకీయ నిర్ణయాలు ఒకరికే ప్రయోజనం కలుగుతుంది. కానీ షర్మిల కాంగ్రెస్‌లో చేరితే అటు కాంగ్రెస్‌కు, ఇటు షర్మిలకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుంది. తెలంగాణ, ఏపీలో వైఎస్ రాజశేఖరరెడ్డిని అభిమానించే ప్రజలు ఉన్నారు. రాయలసీమతో సమానంగా తెలంగాణలో వైఎస్సార్ ను ప్రజలు ప్రేమిస్తారు. రాష్ట్ర విభజనతో వైఎస్ జగన్ తన రాజకీయాలను ఏపీకి మాత్రమే పరిమితం చేయడం, మరో వైపు కాంగ్రెస్ బలహీన పడటం వల్ల వైఎస్సార్ అభిమానులకు తెలంగాణలో రాజకీయ వేదిక లేక గందరగోళంలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి.
ఈ పరిస్థితిని కేసీఆర్ చక్కగా ఉపయోగించుకున్నారు. కారణాలు ఏమయినా షర్మిల తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ ప్రయాణం మొదలుపెట్టారు. వైఎస్సార్ అభిమానులలో కొత్త ఆలోచనలు మొదలు కాగానే కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించడంతో తెలంగాణలో ఆ పార్టీకి రోజులు వచ్చాయి. నాయకత్వం వహించే స్థాయి ఉన్న వైఎస్సార్ అభిమానులు ఎంతో కాలం ఇతరులకు ఉపయోగపడే రాజకీయాలే చేయలేరు.
కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించడంతో సహజంగా అటువైపు చూపు మళ్లింది. అదే సమయంలో షర్మిల పార్టీ ఉండటం ఇద్దరికీ నష్టం. ఇది గమనించిన షర్మిల కాంగ్రెస్‌తో ప్రయాణానికి సుముఖంగా ఉండటం, ఏ అవకాశం వదులుకోకూడదు అనుకున్న కాంగ్రెస్ అంతే వేగంగా స్పందించింది. దీంతో షర్మిల కాంగ్రెస్‌తో రాజకీయ ప్రయాణానికి మార్గం సుగమం అయ్యింది.
షర్మిల తదుపరి అడుగులు కీలకం
వైఎస్సార్‌ను అభిమానించే వారు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉంటారు. కాకపోతే ఏపీలో వైఎస్ రాజకీయ వారసుడిగా జగన్ అధికారంలో ఉన్నారు. ఈ దశలో ఏపీలో షర్మిల సీరియస్ రాజకీయాలు చేస్తే అటు ఆమెకు ఇటు కాంగ్రెస్‌కు పెద్ద ప్రయోజనం ఉండకపోవచ్చు. వికటిస్తే నష్టం కూడా. కాంగ్రెస్‌లో చేరడం వైసీపీకి ఇష్టం లేకపోయినా, తెలంగాణలో వైఎస్సార్ అభిమానులకు వేదిక చూపకుండా, కాంగ్రెస్‌పై ఏపీ అధికార పార్టీ విమర్శలు పనిచేయవు. పై పెచ్చు వ్యతిరేకతను తెచ్చుకుంటారు.
తెలంగాణ రాజకీయాలలో షర్మిల కాంగ్రెస్‌తో ప్రయాణం చేయడాన్ని వైఎస్సార్ అభిమానులు స్వాగతం చెప్పడంతో బాటు భాగస్వామ్యం అవుతారు. ఎలాగూ తెలంగాణ ఎన్నికలు ఏపీకి ముందే ఉంటాయి. కావున షర్మిల తెలంగాణకే ప్రస్తుతానికి పరిమితం కావడం ఉత్తమం. అక్కడ విజయం సాధిస్తే షర్మిలకు కాంగ్రెస్‌లోనూ, ప్రజల్లోనూ మంచి పట్టు వస్తుంది. అది తన రాజకీయ భవిష్యత్‌కు పునాది అవుతుంది.
మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి.