కోర్టు ధిక్క‌ర‌ణ నుంచి త‌ప్పించుకున్న ప్ర‌ముఖ న‌టి

ప్ర‌ముఖ న‌టి స్వ‌రా భాస్క‌ర్ కోర్టు ధిక్క‌ర‌ణ కేసు నుంచి త్రుటిలో త‌ప్పించుకున్నారు. అటార్నీ జ‌న‌ర‌ల్ పుణ్య‌మా అని ఆమె కోర్టు ధిక్క‌ర‌ణ కేసు నుంచి బ‌య‌ట‌ప‌డ్డార‌నే చెప్పాలి. అయోధ్య‌, బాబ్రీ మ‌సీదు భూవివాద…

ప్ర‌ముఖ న‌టి స్వ‌రా భాస్క‌ర్ కోర్టు ధిక్క‌ర‌ణ కేసు నుంచి త్రుటిలో త‌ప్పించుకున్నారు. అటార్నీ జ‌న‌ర‌ల్ పుణ్య‌మా అని ఆమె కోర్టు ధిక్క‌ర‌ణ కేసు నుంచి బ‌య‌ట‌ప‌డ్డార‌నే చెప్పాలి. అయోధ్య‌, బాబ్రీ మ‌సీదు భూవివాద కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై స్వ‌రా భాస్క‌ర్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఆమె వ్యాఖ్య‌ల‌పై మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చింది.

సుప్రీంకోర్టు తీర్పును ధిక్క‌రించేలా ఆమె కామెంట్స్ ఉన్నాయంటూ పిటిష‌న్ వెళ్లింది. ఆమె వ్యాఖ్య‌లు అవ‌మాన‌క‌ర‌మైన‌విగా, సుప్రీంకోర్టు ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీసేలా, న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై దాడి చేసేలా ఉన్నాయ‌ని పిటిష‌న‌ర్ పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో ఆమె ఏమ‌న్నారో ముందుగా తెలుసుకుందాం.

''బాబ్రీ మసీదు కూల్చివేత చట్ట విరుద్ధ‌మంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన దేశంలో మేము నివసిస్తున్నాం. అయితే అదే తీర్పులో మసీదు కూల్చిన వ్యక్తులకు మాత్రం రివార్డులు ప్రకటించడం గమనార్హం. మన రాజ్యాంగంపై న‌మ్మ‌కం, విశ్వాసం లేని ప్రభుత్వాలు మనల్ని పాలిస్తున్నాయి. అలాగే రాజ్యాంగాన్ని నమ్మని పోలీసు వ్యవస్థ మనల్ని పాలిస్తోంది. ఇవన్నీ చూస్తుంటే రాజ్యాంగాన్ని న్యాయస్థానాలైనా విశ్వసిస్తున్నాయో లేదో తెలియని స్థితిలో ప్రస్తుతం మేము ఉన్నామని భావిస్తున్నాం'' అని వేర్వేరు ట్వీట్ల‌లో త‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారామె.  

ఈ ట్వీట్లే ఆమెకు చిక్కులు తెచ్చాయ‌ని చెప్పొచ్చు. ఈ వ్యాఖ్య‌ల‌పై పిటిష‌న‌ర్ సుప్రీంకోర్టు మెట్లు ఎక్కాడు. స్వ‌రా భాస్క‌ర్ కోర్టు ధిక్క‌ర‌ణ‌కు పాల్ప‌డ్డారంటూ పిటిష‌న‌ర్ పేర్కొన్నాడు. అయితే సుప్రీంకోర్టులో కోర్టు ధిక్క‌ర‌ణ పిటిష‌న్ దాఖ‌లు చేసేందుకు అటార్నీ జ‌న‌ర‌ల్ అనుమ‌తి త‌ప్ప‌నిస‌రి. ఒక్క ప్ర‌శాంత్ భూష‌న్‌పై మాత్ర‌మే అటార్నీ జ‌న‌ర‌ల్‌తో సంబంధం లేకుండా త‌న‌కున్న ప్ర‌త్యేకాధికారుల‌తో సుప్రీంకోర్టు కోర్టు ధిక్క‌ర‌ణ కింద విచార‌ణ చేప‌ట్టి నిర్ధారించింది.

స్వ‌రా భాస్క‌ర్‌పై కేసు విష‌యంలో అటార్నీ జ‌న‌ర‌ల్ కేకే వేణుగోపాల్ మాట్లాడుతూ ఆమె సుప్రీంకోర్టుపై ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌లేద‌న్నారు. సుప్రీంకోర్టు ప్రతిష్టను దెబ్బతీయసేలా ఆమె వ్య‌వ‌హ‌రించ‌లేద‌న్నారు.  అలాగే అత్యున్నత న్యాయస్థానం తీర్పును ధిక్కరించలేదని ఆయ‌న అన్నారు. దీంతో స్వ‌రాభాస్క‌ర్ కోర్టు ధిక్క‌ర‌ణ శిక్ష నుంచి త‌ప్పించుకున్న‌ట్టైంది. 

ఆ సినిమా ఎవడూ చూడడని ముందే తెలుసు