వివాహేతర సంబంధాలు ఎంతటి వైపరీత్యాలకు దారితీస్తాయో తెలియజేసే ఉదంతం ఇది. కట్టుకున్న భార్య పక్కన ఉండగా.. ప్రియురాలితో కాపురం చేశాడు భర్త. ఫలితంగా రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. కర్నూలు జిల్లాలో జరిగింది ఈ దుర్ఘటన.
జిల్లాలోని ఆలూరు మండల కేంద్రానికి నాగార్జున అలియాస్ నాగేంద్రకు ఆల్రెడీ పెళ్లయింది. మేనమామ కూతురు శిల్పను ఇష్టపడి చేసుకున్నాడు. కానీ అంతలోనే ఊహించని పరిణామం. బ్యాంక్ పరీక్షల కోచింగ్ కోసం కర్నూలు వెళ్లిన నాగార్జున, అక్కడ ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.
భార్య-కూతుర్ని వదిలేసి ప్రియురాలితో వెళ్లిపోయాడు. దీంతో శిల్ప, తన కూతురు, అత్తమామలతో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో నాగార్జున ప్రియురాలి బంధువులు శిల్పను వేధించడం మొదలుపెట్టారు. ఆ వేధింపులు తట్టుకొని బతుకుతుండగా సడెన్ గా నాగార్జున, తన ప్రియురాలితో కలిసి ఊడిపడ్డాడు. భార్య కళ్లముందే కాపురం పెట్టాడు. భార్య-కూతుర్ని వేధించడం మొదలుపెట్టాడు.
దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన శిల్ప, కూతురితో కలిసి పొలం పక్కనే ఉన్న నీటి కుంటలో దూకి ఆత్మహత్య చేసుకుంది. హుటాహుటిన బయటకు తీసినప్పటికీ తల్లికూతుళ్ల ప్రాణాలు దక్కలేదు. నాగార్జున తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు.. నాగార్జున వేధింపులతో పాటు.. అతడి ప్రియురాలి బంధువుల వేధింపుల వల్లే ఇద్దరి ప్రాణాలు పోయినట్టు ప్రాధమికంగా గుర్తించారు.