జాతీయ పార్టీ బీజేపీలో ప్రసిద్ధ క్రికెటర్, బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ చేరనున్నారనే సంకేతాలు వెలవడుతున్నాయి. పశ్చిమబెంగాల్‌కు చెందిన గంగూలీ భారత క్రికెట్ టీం సభ్యుడిగా, కెప్టెన్‌గా చిరస్మరణీయమైన సేవలందించారు. ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా బరిలో దిగుతూ ప్రత్యర్థులపై తన బ్యాటింగ్‌తో వీరవిహారం చేసేవారు. అలాగే యువ ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ మెరికల్లాంటి క్రీడాకారులను తీర్చిదిద్దిన ఘనత సౌరవ్‌కు దక్కుతుంది.
క్రికెట్‌కు రిటైర్మెంట్ తర్వాత కూడా కోచ్‌గా, సెలక్షన్ కమిటీ సభ్యుడిగా భారత క్రికెట్‌కు సేవలందిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఆయన బీసీసీఐ చీఫ్‌గా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. పశ్చిమబెంగాల్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎలాగైనా ఆ రాష్ట్రంలో అధికారాన్ని చేజెక్కించుకోవాలని బీజేపీ అధిష్టానం సీరియస్‌గా పావులు కదుపుతోంది. ప్రజాదరణ కలిగిన వ్యక్తులను పార్టీలో చేర్చుకునే క్రమంలో సౌరవ్ గంగూలీపై బీజేపీ దృష్టి సారించినట్టు తెలుస్తోంది. బీజేపీలో చేరేందుకు గంగూలీ కూడా సానుకూలంగా ఉన్నట్టు సమాచారం.
ఇటీవల మమతాబెనర్జీ ప్రభుత్వంపై గంగూలీ అసంతృప్తి కూడా ఆయన బీజేపీలో చేరుతారనే ప్రచారానికి బలం కలిగిస్తోంది. గంగూలీ నేతృత్వంలోని ట్రస్ట్ కోల్‌కతాలో ఓ పాఠశాల ఏర్పాటు చేయాలని నిర్ణయించుకొంది. ఇందుకోసం ఈశాన్య కోల్‌కతాలోని చాలా ఖరీదైన న్యూటౌన్ ఏరియాలో మమతా సర్కార్ రెండెకరాల స్థలాన్ని గంగూలీ ట్రస్ట్‌కు కేటాయించింది.
ఇంత వరకూ అంతా బాగుంది. అయితే సదరు స్థలంపై వివాదం నెలకొనడం, ప్రస్తుతం అది కోర్టులో ఉండడంతో గంగూలీ అసం తృప్తికి గురయ్యారు. వివాదాస్పద స్థలాన్ని తన ట్రస్ట్‌కు కేటాయించడం ఏంటని గంగూలీ ప్రశ్నిస్తున్నారు.
ఇటీవల సీఎం మమతా బెనర్జీని కలిసి స్థలాన్ని తిరిగి ఇచ్చేస్తున్నట్టు ప్రకటించారు. ఇదే సమయంలో బీజేపీ అగ్రనేతల నుంచి పార్టీలో చేరాలని పిలుపు రావడంతో గంగూలీ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా త్వరలో పశ్చిమబెంగాల్ జరిగే అసెంబ్లీ ఎన్నికలు రంజుగా మారనున్నాయి.