ఏపీలో చంద్రబాబు ఏకాకి అవుతున్నారు. గతంలో ఎప్పుడూ పొత్తుల పంచాయితీతో కళకళలాడిపోయే బాబు కోటరీ తొలి సారిగా 2109 ఎన్నికల్లో ఒంటరిగా బరిలో దిగింది. అయితే లోపాయికారీ ఒప్పందాలే బాబుకి 23 సీట్లు తెచ్చిపెట్టాయి. ఈసారి అలాంటి విన్యాసాలు కూడా జరగవని తాజా పరిస్థితులు తేల్చిపారేస్తున్నాయి.
ప్రస్తుతానికి బాబుతో అంటకాగుతున్నవి కేవలం వామపక్షాలు మాత్రమే. ఏపీలో వామపక్షాల బలమెంత, వారికి నికరంగా ఎన్ని ఓట్లు పడతాయనే విషయం ఆ పార్టీ నేతలతో సహా అందరికీ తెలుసు. ఇంకా చెప్పాలంటే వామపక్ష నేతలంతా ఎన్నికల్లో నోటాతో పోటీపడుతుంటారు. అంటే ఎర్రకండువాలు బాబు పక్కన ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ఎలాగూ వారికి సీట్లు సర్దుబాటు చేయలేరు కాబట్టి.. 2024 ఎన్నికల నాటికి బాబుకి ఒంటరిపోరు తప్పదు.
బీజేపీపై పెట్టుకున్న ఆశలన్నీ మెల్లమెల్లగా పటాపంచలవుతున్నాయి. వీర్రాజు రాకతో ఆ ఆశలు మరింత అడుగంటాయి. ముందుగా జనసేనను తమతో కలిపేసుకున్న బీజేపీ.. బాబుకి దత్తపుత్రుడి అండ కూడా లేకుండా చేసింది. ఇక ఎన్నికల నాటికి టీడీపీకి పూర్తిగా వైరివర్గంగా మారేందుకు రాష్ట్ర నేతలు ప్రయత్నిస్తున్నారు. చీటికీ మాటకీ చంద్రబాబుని విమర్శించడం, ఆయనతో ఉన్నవారికి కూడా నాలుగు తగిలించడం వీరి లక్ష్యంగా మారింది.
వచ్చే ఎన్నికల నాటికి తమతో కలవాలనే ఆశ చంద్రబాబుకు ఏమాత్రం ఉన్నా.. ఆ ఆశను ఈ మూడున్నరేళ్లలో చెదరగొట్టాలనేది రాష్ట్ర బీజేపీ నేతల ప్లాన్. అందుకే వీలైనంతగా చంద్రబాబుని ఓ రౌండ్ వేసుకుంటున్నారు. తనకి తానే బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే స్టేజ్ కి తీసుకొస్తున్నారు. వీర్రాజు, జీవీఎల్, రామ్ మాధవ్.. ఇలా కీలక నేతలంతా చంద్రబాబుని టార్గెట్ చేయడానికి అసలు కారణం ఇదే. బాబు నోరు జారాలి, తమతోపాటు తమ పార్టీని కూడా విమర్శించాలి, తను తీసుకున్న గోతిలో తానే పడాలి.
రాష్ట్రంలో బీజేపీ అద్యక్ష స్థానంలో మార్పు వచ్చి నెల రోజులు తిరక్కముందే పరిస్థితులు ఎలా మారాయో అర్థమవుతోంది. ఇక ఎన్నికలనాటికి టీడీపీ, బీజేపీ నువ్వానేనా అన్నట్టు ఉండాలనేది వీరి కార్యాచరణ. ప్రస్తుతానికైతే ఏపీలో చంద్రబాబు పొత్తుల పాచిక పారేలా లేదు. వచ్చే దఫా ప్రతిపక్ష హోదా కూడా ఆయనకు కష్టమే. ఒంటరి పోరాటంతో చంద్రబాబు మరింత దారుణ ఓటమి చవిచూడాల్సిందే.