రాహుల్ గాంధీనేమో తనకు రాజకీయాలే ఇష్టం లేనట్టుగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఎలాగోలా రాహుల్ ప్రధాని పీఠం ఎక్కేసి ఉంటే అదో కథ. అయితే తను ప్రధాని కావాలనే కాంక్షతో పని చేసే ఆసక్తి, శక్తి రెండూ రాహుల్ లో కనిపించడం లేదు. జనాలకు బీజేపీపై మరీ మొహం మొత్తి, ఉత్తరాదిన కాంగ్రెస్ కు ఓట్లు పడితే తప్ప రాహుల్ ప్రధాని కాలేడు.
ఇక సోనియాకు వయసు మీద పడుతూ ఉంది. ఆమె ఆసుపత్రులకూ, ఇంటికీ తిరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ కు ఇప్పుడు పెద్ద దిక్కు ఎవరు? అనేది శేషప్రశ్న అవుతోంది.
దారుణం ఏమిటంటే.. సోనియా దిగిపోతే, రాహుల్ వద్దంటే, ప్రియాంక వద్దనుకుంటే.. ఆ పార్టీ జాతీయాధ్యక్ష స్థానంలో కూర్చోదగ్గ అర్హుడు ఎవరు? అని ఆ పార్టీ అభిమానులనే ప్రశ్నించినా సమాధానం చెప్పలేని పరిస్థితి!
అదిగో.. ఫలానా వ్యక్తిని కూర్చోబెడతాం.. అనే సమాధానం కాంగ్రెస్ నుంచి రాదు, రాలేదు! ఒక సమర్థవంతమైన వ్యక్తి పేరును సమాధానంగా ఇవ్వలేరు. ఎవరో ఒకరు కాంగ్రెస్ జాతీయాధ్యక్ష పదవిలో కూర్చోవాలంటే.. వాళ్లు సోనియా దయ చేత నామినేట్ అయ్యే వెన్నెముక లేని నేతలు, వారి మాట మీరని నేతలే కావాలి తప్ప.. సొంతంగా కాస్త ఆలోచించి, పని చేయగల నేత మాత్రం కాంగ్రెస్ లో కనుచూపు మేర కనిపించడం లేదంటే ఆ పార్టీ పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
దాదాపు 20 యేళ్లలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని ఈ స్థాయికి తీసుకొచ్చిన ఘనత నిస్సందేహంగా సోనియాగాంధీదే! ప్రత్యామ్నాయ నేత.. అనే ఊహే కాంగ్రెస్ లో లేకుండా పోయింది. ఆ మధ్య లోక్ సభలో ఖర్గేను నేతగా కూర్చోబెట్టినట్టుగా.. అలా తన విధేయులు ఎవరికో కాంగ్రెస్ జాతీయాధ్యక్ష పదవి పగ్గాలను సోనియా ఇవ్వగలదు. అయితే దాని వల్ల వచ్చే ప్రయోజనం ఎంత? అలాంటి వాళ్లు పగ్గాలు చేపట్టినా.. వాళ్లు సోనియా, రాహుల్, ప్రియాంకల కనుసన్నల్లో పని చేయాల్సిందే! సొంత నిర్ణయాలేవీ ఉండవు. సొంత ఛరిష్మాను పెంచుకోనివ్వరు. అలా పెంచుకోలేని వారికే పగ్గాలు ఇస్తారు. చూస్తుంటే.. సోనియానే కాదు.. రాహుల్, ప్రియాంకలు కూడా కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితుల్లో పెనుభారంగా మారిపోయి, ఆ పార్టీ వెన్ను విరిచేలా ఉన్నారు!
ఏ ఒక్కరినీ కాస్త ఎదగనివ్వకుండా, ఎదుగుతారనే వారిని మొదట్లోనే తుంచేయడం ద్వారా సోనియా.. కాంగ్రెస్ పునాదులనే తవ్వేసి ఈ పరిస్థితికి కారణమయ్యారనడంలో ఎలాంటి సందేహం లేకపోవచ్చు.