‘చిరు’ జోలి నీకెందుకు రోజ‌మ్మా?

టూరిజం మంత్రి రోజాకి నోరు జాస్తి. గ‌తంలో చంద్ర‌బాబును ఏ రేంజ్‌లో పొగిడారో తెలుసు. తేడా వ‌స్తే రేపు జ‌గ‌న్‌కి కూడా శాప‌నార్థాలు త‌ప్ప‌వు. స‌రే, రాజ‌కీయాల్లో ఇది మామూలే అనుకుంటే , ఇప్పుడు…

టూరిజం మంత్రి రోజాకి నోరు జాస్తి. గ‌తంలో చంద్ర‌బాబును ఏ రేంజ్‌లో పొగిడారో తెలుసు. తేడా వ‌స్తే రేపు జ‌గ‌న్‌కి కూడా శాప‌నార్థాలు త‌ప్ప‌వు. స‌రే, రాజ‌కీయాల్లో ఇది మామూలే అనుకుంటే , ఇప్పుడు చిరంజీవిని విమ‌ర్శించ‌డం ఎవ‌రికీ న‌చ్చ‌లేదు. ఎందుకంటే ఆయ‌న రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుని సినిమాలు చేస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో త‌మ్ముడు ప‌వ‌న్ పార్టీకి ప్ర‌చారం చేయ‌లేదు. జ‌న‌సేన‌తో ఎలాంటి సంబంధాలు లేవు. ఎక్క‌డా కూడా జ‌గ‌న్‌కి వ్య‌తిరేకంగా మాట్లాడ‌లేదు. ప్ర‌జారాజ్యం టైమ్‌లో కూడా హుందాగా, డిగ్నిటీగా వ్య‌వ‌హ‌రించారు. చౌక‌బారుగా మాట్లాడే మ‌నిషి కాదు. బ‌హుశా అందుకే రాజ‌కీయాల్లో ఇమ‌డ‌లేదేమో!

ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌త్య‌ర్థి కాబ‌ట్టి ఆయ‌న్ని విమ‌ర్శించే హ‌క్కు మంత్రి రోజాకి వుంది. విధానాల స్థాయి దాటి రాజ‌కీయం వ్య‌క్తిగ‌తంగా తిట్ల పురాణంగా మారింది. కాబ‌ట్టి ప‌వ‌న్ అడ్డూఅదుపూ లేకుండా మాట్లాడుతాడు. ఆయ‌న్ని అదే విధంగా కౌంట‌ర్ చేయ‌డం వైసీపీ నేత‌లు ఒక అల‌వాటుగా మార్చుకున్నారు. అయితే ఉన్న‌ట్టుండి చిరంజీవి మీద ప‌డ‌డం క‌రెక్ట్ కాదు. 

మెగా ఫ్యామిలీ ప్ర‌జ‌ల‌కి ఏమీ చేయ‌లేదు కాబ‌ట్టి ఓడించార‌ట‌! గెలుపోట‌ముల‌కి చాలా కార‌ణాలుంటాయి. ప‌వ‌న్ సంగ‌తి అటుంచితే చిరంజీవి తిరుప‌తిలో గెలిచాడు. కార‌ణాలు ఏమైతేనేం పార్టీని విలీనం చేశాడు. కేంద్ర మంత్రిగా చేసిన‌ప్పుడు కూడా ఆయ‌న మీద ఎలాంటి మ‌చ్చ‌లేదు. త‌న వాళ్లకి ప‌ద‌వులు, కాంట్రాక్టులు ఇప్పించుకున్నాడ‌నే చెడ్డ‌పేరు లేదు. బ్ల‌డ్ బ్యాంక్‌తో సామాజిక సేవ చేసాడు. సినిమా న‌టుడిగా వేల మందికి ఉపాధి క‌ల్పించాడు.

ఆయ‌న ప్ర‌జ‌ల‌కి ఏం చేసాడో పక్క‌న పెడితే రెండుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా అధికారంలో ఉన్న రోజా ప్ర‌జ‌ల‌కి ఏం చేసారో చెబితే జ‌నం సంతోషిస్తారు. గ‌తంలో చంద్ర‌గిరిలో నిల‌బ‌డ్డారు, ఓడిపోయారు. మ‌ళ్లీ ఆ జ‌నం మొహం చూసారా? 9 ఏళ్లుగా న‌గ‌రి ప్ర‌జ‌ల‌కి సొంత డ‌బ్బు ఎంత ఖ‌ర్చు పెట్టార‌ని చిరంజీవి అభిమానులు అడిగితే రోజా ద‌గ్గ‌ర జ‌వాబు వుందా?

ప‌వ‌న్‌క‌ల్యాణ్ జ‌గ‌న్ ప్ర‌త్య‌ర్థి, చంద్ర‌బాబు స్నేహితుడు. జ‌న‌సేన పార్టీని విమ‌ర్శించుకుంటే బాగుంటుంది. ఎవ‌రి జోలికి వెళ్ల‌కుండా వుండే చిరంజీవిని గిల్ల‌డం కోరి త‌ల‌నొప్పి తెచ్చుకోవ‌డ‌మే!