వైసీపీలో అసంతృప్తులు పెరుగుతున్న నేపథ్యంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే వేటు తప్పదని ఆయన ఘాటు హెచ్చరిక చేయడం చర్చనీయాంశమైంది. ఎన్నికల వాతావరణం నెలకున్న నేపథ్యంలో సహజం గానే అన్ని రాజకీయ పార్టీల్లో అసంతృప్తులు, అసమ్మతులు బయటపడడం సహజం. ఇందుకు ఏ పార్టీ మినహాయింపు కాదు. అధికార పార్టీ కాబట్టి వైసీపీలో అసమ్మతికి ఎక్కువ చోటు వుంటుంది.
ఈ నేపథ్యంలో తిరుపతిలో నిర్వహించిన వైసీపీ సమావేశంలో బాలినేని వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరినీ ఉపేక్షించేది లేదని ఆయన తేల్చి చెప్పారు. వెంకటగిరి సమన్వయకర్తగా నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి నియామకాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. అక్కడి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి గత కొంత కాలంగా ప్రభుత్వంపై నిరసన గళాన్ని వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ తనను పిలిపించి మాట్లాడ్తారని ఆనం భావించి వుంటారు. అలాంటివేవీ జరగలేదు. అదును చూసి ఆయన పవర్స్ కట్ చేశారు. డమ్మీ ఎమ్మెల్యేని చేశారు.
బాలినేని వ్యాఖ్యలు అందుకే ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పార్టీని, ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఎవరైనా , ఎంత పెద్ద నాయకు లైనా మాట్లాడితే వేటు తప్పదని ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో అసమ్మతి స్వరాన్ని వినిపిస్తున్న నేతలు ఇతర పార్టీలతో టచ్‌లో వుంటూ, పార్టీకి నష్టం కలిగించేందుకు కుట్రలు చేస్తున్నారనేది సీఎం జగన్ భావన.
అందుకే అలాంటి వాటికి చోటు ఇవ్వకుండా ఎవరైనా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే, ఏ మాత్రం ఉపేక్షించకుండా చర్యలు తీసుకుంటామనే సంకేతాల్ని, హెచ్చరికల్ని బాలినేని ద్వారా సీఎం పంపారనే చర్చ నడుస్తోంది.