నిర్మాత, నటుడు బండ్ల గణేష్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. బండ్ల గణేష్ చాలా చిత్రవిచిత్రమైన మనిషి. ఎప్పుడెలా వుంటారో ఆయనకే తెలియని పరిస్థితి. తానిక రాజకీయాలు మాట్లాడనని ఒక దఫా అంటారు. సోషల్ మీడియాకు దూరమని మరొకసారి అంటుంటారు. మాటపై నిలకడలేని తనం కొట్టొచ్చినట్టు కనిపిస్తూ వుంటుంది. తాజాగా బండ్ల గణేష్ చేసి కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి.
బీఆర్ఎస్ ఎంపీ రంజిత్‌రెడ్డి కాళ్లు మొక్కడం గమనార్హం. బీఆర్ఎస్లో తాను లేనని ఆయన అన్నారు. కానీ రంజిత్ వెంట ఉన్నానని ఆయన ప్రకటించడం విశేషం. రంజిత్‌రెడ్డే లేకుంటే తాను ఆత్మహత్య చేసుకునేవాడినని షాకింగ్ కామెంట్స్ చేయడం సంచ లనం రేకెత్తిస్తోంది. ఎంపీ రంజిత్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో బండ్ల పాల్గొన్నారు. తన కాళ్లపై పడ్డ బండ్లను రంజిత్ పైకి లేపారు.
బండ్ల భుజాలు తట్టారు. ఈ సందర్భంగా బండ్ల మాట్లాడుతూ రంజిత్ అన్న తనకు దైవంతో సమానమన్నారు. జనసేనాని పవన్‌కల్యాణ్‌ను కూడా బండ్ల గణేష్ ఇదే రీతిలో ప్రశంసించడం తెలిసిందే. బండ్ల గణేష్ దేవుళ్లు నెమ్మదిగా పెరుగుతున్నారు.
రంజిత్‌రెడ్డిని దైవంగా భావించడానికి కారణాలేంటో వివరించి వుంటే బాగుండేది. ఎందుకంటే పాదాభివందనం చేసేంతగా ఎంపీ చేసిన సాయం ఏంటి? అలాగే ఆత్మహత్య ఆలోచనను విరమించేంత చేయూత రంజిత్ ఏం చేశారనే చర్చకు తెరలేచింది. బండ్ల గణేష్ వ్యవహారం సినీ, రాజకీయ రంగాల్లో చర్చనీయాంశమైంది.