బీజేపీ అగ్రనేతలు అద్వానీ, మురళీ మనోహర్జోషి, ఉమాభారతి, కల్యాణ్‌సింగ్ తదితరులను బాబ్రీ మసీదు కూల్చివేత కేసు వెంటాడుతోంది. మరో ఐదు వారాల్లో బీజేపీ అగ్రనేతల భవిష్యత్ ఏంటో తేలనుంది. ఈ కేసును సెప్టెంబర్ 30వ తేదీ నాటికి విచారణ పూర్తి చేసి తుది తీర్పు ఇవ్వాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. నిజానికి ఈ కేసు తుది తీర్పు ఈ నెల 31తో వెలువరించాల్సి ఉంది.
అయితే మరికొంత సమయం కావాలని సీబీఐ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కోరడంతో సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించి మరో నెల గడువు పెంచింది. ఈ మేరకు జస్టిస్ రొహింటన్ నారీమన్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. 1992, డిసెంబర్లో బాబ్రీ మసీదు కూల్చివేత దేశాన్ని పెద్ద కుదుపునకు గురి చేసింది. ఈ ఘటనలో బీజేపీ అగ్రనేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి, కల్యాణ్‌సింగ్ తదితరులు నిందితులు.
దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ఈ కేసును రెండేళ్లలో విచారణ పూర్తి చేసి తీర్పు ఇవ్వాలని 2017లో సుప్రీంకోర్టు…సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆదేశించింది. సుప్రీంకోర్టు విధించిన గడువు 2019, జూలైలో ముగి సింది. అప్పట్లో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విజ్ఞప్తి మేరకు మరో 9 నెలల గడువును సుప్రీంకోర్టు పొడిగించింది.
ఆ గడువు ఈ నెలా ఖరుతో ముగుస్తుంది. మళ్లీ గడువు కోరడంతో మరో నెల పొడిగించింది. ఈ నేపథ్యంలో వచ్చే నెలాఖరులో వెలువడనున్న సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు ఎలా ఉండబోతుందోననే ఉత్కంఠ దేశ వ్యాప్తంగా నెలకొంది.