గ్రౌండ్ వదిలేసిన నాయుడు

ఒక్కోసారి మనకు వాస్తవం తెలిసినా, దాన్ని అంగీకరించడానికి లేదా, దాని గురించి ఆలోచించడానికి పెద్దగా మనసు ముందుకు రాదు. దాని నుంచి తప్పించుకోవడం కోసం లేదా, అసలు అది మనకు తెలియనట్లు, అది మనకు…

ఒక్కోసారి మనకు వాస్తవం తెలిసినా, దాన్ని అంగీకరించడానికి లేదా, దాని గురించి ఆలోచించడానికి పెద్దగా మనసు ముందుకు రాదు. దాని నుంచి తప్పించుకోవడం కోసం లేదా, అసలు అది మనకు తెలియనట్లు, అది మనకు పట్టనట్లు వుండడం కోసం ఏదోదో ప్రదర్శన ప్రయత్నం చేస్తుంటాం. ఫార్టీ ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న పని ఇదే.

వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన ఏడాది తరువాత ఆంధ్ర ప్రదేశ్ లో రెండు భిన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒకటి పల్లెల్లో అందంగా తయారవుతున్న స్కూళ్లు.  పలు చోట్ల రైతు వికాస కేంద్రాల ఏర్పాటు, రైతులకు అక్కడే అందిన విత్తనాలు, ఎరువులు. వాటి కోసం నిర్మిస్తున్న భవనాలు. పిలిచి పిలచి మరీ ఏరియాల వారీగా, పల్లెల వారీగా, చేస్తున్న కరోనా టెస్ట్ లు. ఏదో ఒక రూపంలో జనాల బ్యాంకు ఖాతాల్లోకి వచ్చి పడుతున్నడబ్బులు. ఈ డబ్బులు తీసుకోవడం కోసం బ్యాంకులకు లైను కడుతున్న జనాలు. అన్నింటికి మించి పల్లె నుంచి పట్నానికి వెళ్లి తమకు కావాల్సిన చిన్న పని కోసం విచారణ చేయాల్సిన అవసరం లేకుండా, విషయం ఏదైనా వివరించగలుగుతున్న వాలంటీర్ వ్యవస్థ.

ఇంకో దృశ్యం కూడా వుంది. రాజధాని అమరావతిని మూడు ముక్కలుగా మారుస్తున్నారు. మందు రేట్లు పెరిగాయి. టాప్ బ్రాండ్స్ కాకుండా ఏవేవో పిచ్చి, పిచచి పేర్లతో రకరకాల మద్యం విక్రయిస్తున్నారు. అన్నింటికి మించి నిత్యం…అనునిత్యం కోర్టుతో మొట్టికాయలు తింటున్నారు.

ఈ రెండు దృశ్యాలు కాకుండా మరో అదృశ్య దృశ్యం కూడా వుంది. తమకు ఇళ్లపట్టాలు రకాకుండా చంద్రబాబు అడ్డం పడుతున్నారు. తమకు రాజధాని రాకుండా బాబు అడ్డం పడుతున్నారు. తమకు హైకోర్టు రాకుండా నాయుడు అడ్డం పడుతున్నారు.

ఇప్పుడు విషయానికి వస్తే చంద్రబాబుకు కానీ, ఆయనను నిలువునా మోసం చేస్తున్న ఆయన అనుకూల మీడియాకు కానీ పల్లెల్లో కనిపిస్తున్న దృశ్యాలు అస్సలు పట్టడం లేదు. పోనీ అలా అని అదృశ్యంగా కొంత మంది ప్రజల్లో అయినా చంద్రబాబు నాయుడు పట్ల పెరుగుతున్న అసంతృప్తి కనిపించడం లేదు. కేవలం కోర్టులు, కేసులు, రాజధాని…ఈ మూడే..ఈ మూడే.

జనానికి కావాల్సింది

సాధారణంగా ఏ వ్యాపారం అయినా, ఏ సృజన అయినా, ఏ నాయకుడు అయినా జనాభీష్టం మేరకు పని చేస్తారు. జనాలను ఆకట్టుకుంటే సులువుగా లక్ష్యం చేరవచ్చు అనేదే దీనికి ప్రాతిపదిక.

జగన్ కు ఇదే ఆలంబన..ఎలా? జనాలకు డబ్బులు ఇస్తే, జనాలను అన్ని విధాలుగా ఆకట్టుకుంటే  తనకు అధికార భవిష్యత్ పదిలంగా వుంటుందనే ఆశ.

నాయుడు కానీ ఆయన అనుకూల మీడియా కానీ జనాలను దృష్టిలో పెట్టుకోవడం లేదు. ఇక జనాలతో లాభం లేదు అనే నిర్ణయానికి వచ్చేసారు నాయుడు కానీ ఆయన మీడియా కానీ. అందుకే జగన్ ను ఏదో విధంగా గద్దె దింపాలి. ఏదో విధంగా జగన్ ను జైలుకు పంపాలి. ఆపైన భారతి కాదు మరెవరు ముఖ్యమంత్రి అయినా వైకాపాను చిన్నా భిన్నం చేయడం అన్నది తమకు పెద్ద సమస్య కాదు. అర్జునుడిని దూరం చేస్తే పాండవులను నిలవరించడం, అభిమన్యుడిని చంపేయడం పెద్ద కష్టం కాదు అన్నది కౌరవుల ఆలోచన భారతంలో. ఇక్కడా అదే తరహా ఆలోచన.

జగన్ ను ముందు కట్ చేస్తే..

మిగిలినన్నీ పక్కన పెడితే, జగన్ ను ఇలా వదిలేస్తే అయిదేళ్ల తరువాత మళ్లీ తేడా వస్తే, ఇక తెలుగుదేశం పార్టీ అనేదాన్ని ఇక మరిచిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. వేల కోట్ల అమరావతి రియల్ పెట్టుబడులు పోయి, పార్టీ పోయి, అధికారం పోతే ఇక ఆ సామాజిక వర్గ పరిస్థితి ఎలా వుంటుంది? అందుకే సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. ఎన్ని కోట్లు అయినా ఖర్చు చేస్తున్నారు. ముందు ఏదో విధంగా జగన్ ను కట్ చేసేయాలి. అది కోర్టుల ద్వారా తప్పమరో విధంగా సాధ్యం కావడం లేదు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వుండి వుంటే పని సులువుగా జరిగేదేమో? కానీ కేంద్రం లో వున్న భాజపా మాట వినడం లేదు.

ఇక మిగిలింది కోర్టులే. కోర్టుల్లో ఈ బ్రేకులు, అడ్డంకుల వల్ల జగన్ కు వచ్చిన సమస్య లేదు. అనుకున్నది చేయకలేకపోవడం తప్ప మరే సమస్యా రాదు. కానీ అది కాదు కావాల్సింది. జగన్ బెయిల్ క్యాన్సిల్ కావాలి. జగన్ ఏదో విధంగా అభిశంసనకు గురి కావాలి. లేదా జగన్ ఏదో విధంగా లోపలకు పోవాలి. జగన్ అనే వాడు ఒక్కడు తప్పుకుంటే వైకాపాను తాము బీభత్సంగా చీల్చి చెండాడేయవచ్చు. ఆ తరువాత అప్పుడు జనం సంగతి చూసుకోవచ్చు. అదీ ప్లాన్.

జనం గమనిస్తున్నారు

కానీ చంద్రబాబు అండ్ కో జనాన్ని తేలిగ్గా తీసుకుంటున్నారు. జగన్ అనేవాడు లేకపోతే, వైకాపాను చీల్చి చెండాడేస్తే,ఇక ఆటోమెటిక్ గా తమదే రాజ్యం అనే భావనలో వున్నారు.  కానీ జనం అంతా గమనిస్తున్నారన్న సంగతి విస్మరిస్తున్నారు. ఇళ్ల పట్టాల విషయంలో జనం పూర్తి క్లారిటీతో వున్నారు. కేవలం చంద్రబాబు, తెలుగుదేశం కారణంగానే ఇళ్ల పట్టాలు తమకు అందకుండా పోతున్నాయని వారికి క్లారిటీ వచ్చేసింది.

ప్రతి ఊరిలో ముచ్చటగా రెడీ అయిన లే అవుట్ లు వాళ్లకు ఈ విషయాన్ని పదే పదే గుర్తు చేస్తూనే వున్నాయి. రేపు ఎన్నికలు రావచ్చు. జగన్ వున్నా లేకున్నా, చంద్రబాబు వచ్చి, ఇళ్ల స్థలాలు నేను వచ్చి ఇస్తా అన్నా కూడా జనం ఈ విషయం మరిచిపోతారు అని అనుకోవడానికి లేదు.

అలాగే చంద్రబాబు అండ్ కో మరో విషయం గమనించాలి. జనం ఎప్పుడూ విదేశాల్లో మాదిరిగా బొలో మంటూ నిరసన వ్యక్తం చేయరు. జగన్ మీద అయినా బాబు మీద అయినా తమ అసంతృప్తిని తమలోనే వుంచుకుంటారు. బ్యాలట్ బాక్స్ ల్లోనే తమ అసంతృప్తిని వెళ్ల గక్కుతారు. పసుపు కుంకుమ ఇచ్చిన బాబు మీద అలాగే వెళ్ల గక్కారు. ఇప్పుడు జగన్ మీద జనానికి అసంతృప్తి వుందా లేదా అన్నది బ్యాలట్ బాక్స్ ల్లోనే తెలుస్తుంది. జగన్ లేకపోయినంత మాత్రాన అధికారం తమదే అని చంద్రబాబు ఆలోచించడం కొంత వరకు సంతృప్తి ఇస్తే ఇవ్వొచ్చు కానీ, అధికారం అందిస్తుందా? అన్నది అనుమానమే.  ఎందుకంటే ప్రతిపక్షం అనే ఏదో ఒక రూపంలో రాష్ట్రంలో వుంటూనే వస్తుంది.

న్యాయ వ్యవస్థను వాడేస్తున్నారు

జగన్ ను గద్దె దించడానికి చంద్రబాబు అండ్ కో పన్నుతున్న కుట్రలు ఇన్నీ అన్నీ కావు. అన్నీ కళ్లకు కడుతున్నాయి. అయిన దానికీ కాని దానికీ కోర్టు తలుపు తడుతున్నారు. అక్కడేం జరుగుతోంది? ఎలా జరుగుతోంది అన్నది పక్కన పెడితే, దీనివల్ల ఓ అనర్థం జరుగుతోంది. కోర్టు తీర్పులు, కోర్టుల వ్యవహారాలు అన్నీ సామాన్య ప్రజానీకం మధ్య వాదనలకు, చర్చలకు దారితీస్తున్నాయి. న్యాయమూర్తుల ఫోన్ లు ట్యాప్ చేసారని, న్యాయమూర్తుల వ్యవహారాల్లో సామాజిక కోణాలు చూస్తున్నారని వస్తున్న వార్తలు అన్నీ కలిసి న్యాయ వ్యవస్థను ప్రజల్లో పలుచన చేసే ప్రమాదం క్లియర్ గా కనిపిస్తోంది.

ఇప్పటికే పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కినంత మాత్రాన అందరికీ న్యాయం జరగదని, అక్కడ అధికారం వున్నవాడిదే రాజ్యమని ఓ స్థిర అభిప్రాయం జనంలోకి వెళ్లిపోయింది. అది ఎంత వరకు వాస్తవమన్నది అనవసరం. జనంలోకి అలా వెళ్లిపోయింది అంతే. ఇప్పుడు చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి పెద్ద పెద్ద విషయాల వరకు ప్రతిపక్షం ఏదో రూపంలో కోర్టుల తలుపు తడుతూ, తమ తమ రాజకీయ ప్రయోజనాల కోసం కోర్టులను వాడుతూ వుంటే, జనంలో ఏర్పడుతున్న అభిప్రాయం మరోలా వుంది. జనం కోర్టుల గురించి ఆలోచించడం లేదు. మాట్లాడడం లేదు. కానీ జగన్ ను అడ్డు కోవడం కోసం బాబు అండ్ కో కోర్టులను వాడుకుంటున్నారన్న భావన జనాల్లోకి బలంగా వెళ్తోంది. ఇది బాబు అండ్ కో అస్సలు గమనించడం లేదు

రాజధాని ఎవరిది?

రాజధాని విషయంలో కూడా ఇదే జరుగుతోంది. అమరావతి గురించి చంద్రబాబు ఇస్తున్న ప్రకటనలు అలా వున్నాయి. లక్షల కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం అని, స్వయం ఆదాయం సాధించగల రాజధాని అని బాబు అంటున్నారు. అక్కడ పేదలకు ఫ్లాట్లు ఇస్తాం అంటే కోర్టు మెట్లు ఎక్కారు. ఇక్కడ ప్లాట్లు వస్తాయని ఎదురుచూస్తున్నవారు వందల్లో వుంటారు. వారి ఓట్లు మహా అయితే వేలల్లో వుంటాయి. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే అమరావతిలో ఎవ్వరికీ ఇళ్లపట్టాలు చంద్రబాబు ఇవ్వాలేదా ? అన్నది.

పేర్లు అనవసరం, హోదాలు అనవసరం. చంద్రబాబు హయాంలో ఆయనకు కావాల్సిన వారికి ఆయన ఇళ్ల స్థలాలు ఇచ్చుకున్నారు. పిల్లి కళ్లు మూసుకున్న చందంగా వుందీ వ్యవహారం. పైకి మాట్లాడకున్నా, మాట్లాడే పరిస్థితి లేకున్నా, ఆ హక్కు రాజ్యాంగం ఇవ్వకపోయినా, జనాల మనసులకు తెలుసు, అక్కడ చంద్రబాబు ఎవరికి స్థలాలు ఇచ్చారు అన్నది. ఎవరు ఇప్పుడు చంద్రబాబు అభీష్టం మేరకు పేదలకు స్థలాలు రాకుండా అడ్డం పడుతున్నారన్నది. ఇది చాలదా? చంద్రబాబు మరోసారి అధికారంలోకి రావడానికి అడ్డంపడే సవాలక్ష అంశాల్లో ఒకటిగా మారడానికి? రాజధాని కేవలం డబ్బున్న, పలుకుబడి, అధికారం వున్న వారికేనా, తమలాంటి సామాన్యులకు కాదా? అనే ఆలోచన రావడానికి?

జనం అంత వెర్రోళ్లా?

చంద్రబాబు ఆ మధ్య ఓ మాట అన్నారు. తను అధికారంలో వున్నన్నాళ్లు ఏ సదస్సులు, సమావేశాలు అయినా విశాఖలోనే నిర్వహించా అన్నారు. నిజానికి ఆ వ్యవహారం వెనుక సంగతులు కూడా జనానికి తెలుసు. విశాఖలో అయిదేళ్ల కాలంలో ఓ టాప్ హోటల్ కు ప్రభుత్వం ఏ మేరకు బిల్లులు చెల్లించిందో లెక్కలు తీస్తే, అసలు ఎందుకు అన్ని సమావేశాలు అక్కడ నిర్వహించిందో అర్థం అవుతుందని విశాఖకు చెందిన ఓ స్థానిక నేత అభిప్రాయపడ్టారు. ఆ హోటల్ తో, ఆ హోటల్ కు చెందిన విజయవాడ బ్రాంచ్ తో లోకేష్ కు సంబంధాలు వుండడమే అందుకు కారణం అని ఆ లోకల్ నేత ఆరోపించారు. అంటే మనం ఏమనుకున్నా, ఏం చెబుతున్నా,. జనాలకు చేరాల్సిన నిజాలు లేదా జనాలకు చేరాల్సిన విషయాలు జనాలకు చేరిపోతున్నాయి. ఆ సంగతిని చంద్రబాబు ఆయన సన్నిహితులు గమనించడం లేదు. అంతే.

జగన్ ముందు అడ్డంకులు

ఇప్పుడు నిజానికి మిన్ను విరిగి మీద పడినంత హడావుడి చేస్తోంది ప్రతిపక్షం. కానీ అసలు జగన్ ముందు వున్న సమస్యలు ఏమిటి? మూడు రాజధానులుగా మార్చడం, టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. ఈ రెండే కదా? టెలిఫోన్ ట్యాపింగ్ అన్నది ఇటు అటు కూడా రుజువు అయ్యే వ్యవహారం కాదు. కాస్త హడావుడి తప్ప. ఇక రాజధాని వ్యవహారమా?  లేదు, కూడదు అంటూ కోర్టు ఆపేసిందే అనుకుందాం. జగన్ కు పోయేది ఏముంది? కానీ అలా అని అమరావతి ముందుకు వెళ్తుందా? జగన్ హయాంలో. అస్సలు వెళ్లదు. మొత్తం మీద కోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చినా? ఇవ్వకున్నా అమరావతికి వచ్చిన లాభం వుండదు.

కానీ ఈ రెండు సమస్యలు వదిలేసి జగన్ అయిదేళ్లు తను అనుకున్నట్లు పంచుకుంటూ వెళ్లిపోతే, అప్పుడు తెలుగుదేశానికి అసలు సమస్య మొదలవుతుంది. రెండు జిల్లాల కోసం పదకొండు జిల్లాలను దూరం చేసుకున్నట్లు అవుతుంది. పక్కాగా రాయలసీమను, అలాగే ఉత్తరాంధ్రను వదిలేసుకున్నట్లు అవుతుంది. ఆపైన మళ్లీ అమరావతి వాసుల అదృష్టం బాగోక, జగన్ నే అధికారంలోకి వస్తే పరిస్థితి ఏమిటి?

రాంగ్ రూట్లో బాబు

మొత్తం మీద బాబు నాయుడు రాంగ్ రూట్లో వెళ్తున్నారు. అమరావతి అనే వేల కోట్ల వ్యవహారం బాబును ఆయన సామాజిక వర్గాన్ని గంగవెర్రులెత్తిస్తోంది. ఆ సమస్యను ఎలా అధిగమించాలో తెలియక, సర్వ శక్తులు ఒడ్డుతూ కిందా మీదా అవుతున్నారు. కానీ అదే సమయంలో రాజకీయంగా అవసరం అయిన గ్రౌండ్ ను వదిలేసుకుంటున్నారు. జగన్ అనేవాడు రాజకీయాల్లో బలంగా వున్నంతకాలం ఈ గ్రౌండ్ వదిలేసుకోవడం అనే చర్య చంద్రబాబు నాయుడు కు ఆత్మహత్యా సదృశమే. కానీ ఇక్కడ ఆయన బాధ అయనది. ఇటు చూస్తే నుయ్యి, అటు చూస్తే గొయ్యి అనే టైపు. అమరావతిని వదిలితే ఓ బాధ, వదలకుంటే మరో బాధ. ఇది రాజకీయాల్లో పగవాడికి కూడా రాకూడని సమస్య.

చాణక్య
[email protected]