నటుడు మోహన్ బాబు మరోసారి ఫైర్ అయ్యారు. చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఎక్కడా చంద్రబాబు పేరు ఆయన ఉచ్ఛరించలేదు. కానీ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. తను రాజకీయాల్లో రాణించలేకపోయానని అసంతృప్తి ఉందని, దానికి కారణం చంద్రబాబు అని పరోక్షంగా ఆరోపించారు మోహన్ బాబు.
“రాజకీయాల్లో రాణించలేకపోయాననే అసంతృప్తి ఉండిపోయింది. ఒకప్పుడు ఒకడు దెబ్బ కొట్టాడు. ఇప్పుడు అతడి గురించి మాట్లాడ్డం నాకు ఇష్టం లేదు. కలిసి వ్యాపార సంస్థ (హెరిటేజ్) కూడా పెట్టాం. దాన్ని అతడు కొట్టేశాడు. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. నన్ను మోసం చేశాడు. అయితే చచ్చిన పామును మళ్లీ కొట్టకూడదు. అందుకే వదిలేశాను.”
తర్వాత రోజుల్లో చంద్రబాబుతో సర్దుకుపోమని తనకు చాలామంది సలహాలు ఇచ్చారని చెప్పిన మోహన్ బాబు.. అలా సలహాలు ఇచ్చినోళ్లకు సిగ్గులేదన్నారు. చంద్రబాబును కాకా పట్టి వాళ్లంతా పదవులు పొందారని, తనకు ఆ ఖర్మ పట్టలేదని చెప్పుకొచ్చారు.
“వాడితో ఎందుకు అడ్జెస్ట్ కాలేకపోయారని కొంతమంది నన్ను అడిగారు. ఆ మూర్ఖులకు నేను చెప్పేది ఒకటే. ఒరేయ్ పిచ్చ మనుషుల్లారా (ఆ కొంతమంది).. కాలికి ముల్లు గుచ్చుకుంటే ఆ బాధ నాకు తెలుస్తుంది. వాళ్లు వాడి దగ్గర చేరారు. పదవులు పొందారు, లాభాలు పొందారు. వాడిని కాకా పడుతూ బతకాల్సిన ఖర్మ నాకు పట్టలేదు. ఈరోజు వాడు వేల కోట్ల రూపాయలకు అధిపతి అయ్యాడు. అయినా ఏం లాభం.”
ఇలా చంద్రబాబుపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు మోహన్ బాబు. పైకి నవ్వుతూ పలకరిస్తూ వెనక గోతులు తవ్వడమే రాజకీయం అంటున్న ఈ నటుడు.. ముక్కుసూటిగా వ్యవహరించే తనలాంటి వాళ్లకు పాలిటిక్స్ సెట్ అవ్వవని ముక్తాయించారు.