చంద్రుడి ఉపరితలంపై నీటి జాడ ఉందనే విషయాన్ని చంద్రయాన్-1 (2008)లోనే గుర్తించారు. ఇక తాజాగా జరిపిన చంద్రయాన్-3 ప్రయోగంలో మరిన్ని కొత్త ఆవిష్కరణలు కనుగొన్నారు. ప్రయోగంలో భాగంగా రోవర్ కు అమర్చిన లేజర్ ప్రేరిత బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోప్ – లిబ్స్ నుంచి చంద్రుడి దక్షిణ దృవంపై మరిన్ని మూలకాల్ని కనుగొన్నారు
దక్షిణ దృవంలో అల్యూమినియం, కాల్షియం, ఐరన్, క్రోమియం, టైటానియం, మాంగనీస్, సిలికాన్ జాడలు ఉన్నట్టు ఇస్రో కనుగొంది. అయితే వీటి కంటే, చంద్రుడి దక్షిణ ధృవంపై సల్ఫర్ జాడను కనుగొన్నామనే ఆనందం ఇస్రోలో ఎక్కువగా కనిపిస్తోంది. సల్ఫర్ నిజంగా అంత కీలకమా? చంద్రుడిపై సల్ఫర్ ఉంటే మనిషికి లాభం ఏంటి?
చంద్రయాన్-3లో సల్ఫర్ జాడ కనుక్కోవడం అతిపెద్ద మేలి మలుపుగా చెబుతున్నారు శాస్త్రవేత్తలు. సాధారణంగా అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు ఆ చర్య నుంచి సల్ఫర్ ఉద్భవిస్తుంది. అలా పుట్టిన సల్ఫర్, తన అస్థిరత కారణంగా వెంటనే వాతావరణంలో కలిసిపోతుంది. కాకపోతే ఉపరితలంపై ఘనరూపంలో ఉండే నీరు వల్ల సల్ఫర్ కొంత నిల్వ ఉంది.
దీనిపై మరో వాదన కూడా వినిపిస్తోంది. చంద్రుడి దక్షిణ దృవంపై ఉన్న రేడియేషన్ కారణంగా, ఘనీభవించిన నీరు విచ్ఛిన్నమై తద్వారా కూడా సల్ఫర్ ఉద్భవించే అవకాశం ఉందంటున్నారు. సల్ఫర్, కలుషితాల్ని శోషించుకుంటుంది. దీని వల్ల చంద్రుడిపై ఘనీభవించిన నీరు పరిశుభ్రంగా ఉండే అవకాశం ఉంది.
కాబట్టి సల్ఫర్ జాడతో చంద్రుడి ఆవిర్భావానికి సంబంధించి మరిన్ని వివరాలు బయటకొచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు.. చంద్రుడిపై చేసే ప్రయోగాలకు కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు సైంటిస్టులు. రాబోయే రోజుల్లో చంద్రుడిపై మనిషి నివశించగలడు అని గట్టిగా చెప్పడానికి, ఆ దిశగా ప్రయోగాలు చేయడానికి సల్ఫర్ ఉనికి అత్యవసరం అంటున్నారు.
ప్రస్తుతం ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రుడిపై హైడ్రోజన్ ఉనికికి సంబంధించి ప్రయోగాలు ముమ్మరం చేశారు. హైడ్రోజన్ ఉనికి కూడా లభ్యమైతే.. చంద్రయాన్-3 సూపర్ సక్సెస్ అయినట్టే. చంద్రుడిపై ఉన్న వాతావరణ పరిస్థితుల వల్ల మరికొన్ని రోజుల్లో రోవర్ తన శక్తిని కోల్పోనుంది.