పవన్ కల్యాణ్ పుట్టినరోజుకు ఓజీ నుంచి కచ్చితంగా ఓ ట్రీట్ ఉండబోతోందనే విషయం తెలిసిందే. ఈ మేరకు డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ నుంచి ప్రకటన కూడా వచ్చేసింది. ఇప్పుడీ ట్రీట్ కు సంబంధించి ఫ్యాన్స్ కే మరో ఆప్షన్ ఇచ్చింది నిర్మాణ సంస్థ.
సెప్టెంబర్ 2న రాబోతున్న వీడియో ట్రీట్ ను ఏ టైమ్ కు రిలీజ్ చేయాలో చెప్పాలంటూ పవన్ ఫ్యాన్స్ ను కోరింది నిర్మాణ సంస్థ. ఎక్కువమంది అభిమానులు చెప్పిన టైమ్ కే స్పెషల్ గ్లింప్స్ ను విడుదల చేస్తామంటూ ప్రకటించింది.
దీంతో పవన్ ఫ్యాన్స్ పోటెత్తారు. ఎక్కువమంది చెప్పిన టైమ్ మాత్రం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య ఉంది. సో.. అదే టైమ్ కు ఓజీ గ్లింప్స్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఈ సినిమాకు సంబంధించి 'నో ఫస్ట్ లుక్' అంటూ ఇప్పటికే దర్శకుడు సుజీత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. సో.. కచ్చితంగా 2వ తేదీకి గ్లింప్స్ వస్తుందని అంతా ఫిక్స్ అయిపోయారు.
పవన్ చేస్తున్న అతికొద్ది స్ట్రయిట్ సినిమాల్లో ఓజీ కూడా ఒకటి. రీసెంట్ గా అతడు చేసిన బ్రో, భీమ్లానాయక్, వకీల్ సాబ్ సినిమాలన్నీ రీమేకులే. వాటి నుంచి బయటకొచ్చి, ఒరిజినల్ కథతో ఓజీ చేస్తున్నాడు పవన్. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాతో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి టాలీవుడ్ కు పరిచయమౌతున్నాడు.