బొత్స మేనల్లుడు టార్గెట్

విజయనగరం జిల్లాలో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణకు వెన్నుదన్నుగా ఉండే నాయకుడు మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు. చిన్న శ్రీను అని అంతా ఆయనను పిలుచుకుంటారు. విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేస్తున్న చిన్న…

విజయనగరం జిల్లాలో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణకు వెన్నుదన్నుగా ఉండే నాయకుడు మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు. చిన్న శ్రీను అని అంతా ఆయనను పిలుచుకుంటారు. విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేస్తున్న చిన్న శ్రీనును వైసీపీ అధినాయకత్వం విజయనగరం జిల్లా వైసీపీ ప్రెసిడెంట్‌గా కూడా నియమించింది.

పదునైన వ్యూహాల రచనతో పాటు పార్టీని పటిష్టం చేసే విధానంలో చిన్న శ్రీను పార్టీ పెద్దల మెప్పు పొందారు. 2019 ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి కూడా అదే మ్యాజిక్ ని రిపీట్ చేస్తామని చెబుతోంది. ఈ నేపధ్యంలో చిన్న శ్రీను మీద పెద్ద నేరమే మోపారు అని ఆయన అనుచరులు అంటున్నారు.

జగన్ మీద 2018లో విశాఖ విమానాశ్రయంలో జరిగిన కోడి కత్తి దాడి కేసులో చిన్న శ్రీను పేరుని ఇరికించే ప్రయత్నాలు జరగడం పట్ల ఆయన అనుచరులు రగిలిపోతున్నారు. ఇదంతా తమను ఎదుర్కోలేక టీడీపీ పన్నిన కుట్ర అని చిన్న శ్రీను అంటున్నారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి టీడీపీ దాని అనుకూల మీడియా తన మీద నిందలు వేసి బురద జల్లడం దారుణం అన్నారు.

జిల్లా ప్రజలకు తాను ఏంటో బాగా తెలుసు అన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీకి జిల్లాలో ఘోర పరాభవం ఎదురవుతుందని ఆయన జోస్యం చెప్పారు. తనను దోషిగా చెబుతున్నారని, ఏ ఆధారాలతో ఇలా అంటున్నారని ఆయన ప్రశ్నించారు.

మీరు ఎన్ని కట్టు కధలు అల్లినా మీ మీడియాలో ఎంత రాసుకున్నా తన పట్ల ప్రజలకు ఉన్న నమ్మకం చెదరదని, టీడీపీకి జిల్లాలో ఓటమి తప్ప గెలుపు దక్కదని ఆయన జోస్యం చెప్పారు. చిన్న శ్రీనుని టార్గెట్ చేయడం వెనక టీడీపీ రాజకీయ వ్యూహాలు ఏంటి అన్నది ఇపుడు వైసీపీలో మధనం సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీని దెబ్బ తీసే వ్యూహాలలో ఇది ఒక భాగమని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.