తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరుతో వైయస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించి ఇన్నాళ్లుగా సుదీర్ఘ ప్రస్థానం సాగించిన వైయస్ షర్మిల ఒక్కసారిగా కాడి పక్కన పడేస్తున్నారు. తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి ఆమె నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించి కొన్ని నెలలుగా వార్తలు వస్తున్నప్పటికీ, తాజాగా ఢిల్లీలో సోనియాగాంధీ రాహుల్ గాంధీ లతో భేటీ అయిన షర్మిల విలీనానికి సంబంధించి ప్రాథమిక లాంఛనం పూర్తి చేశారు.
హై కమాండ్ తో భేటీ తర్వాత తెలంగాణ ప్రజల కోసం నిరంతరం పోరాడుతుంటానని, కేసీఆర్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లేనని ఆమె చాలా ఆర్భాటంగా ప్రకటించారు. ఇదంతా బాగానే ఉంది కానీ ఆమె పోకడ గమనిస్తే, సోనియా గాంధీ విసిరిన ఉచ్చులో షర్మిల చిక్కుకున్నట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు.
వైయస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించిన నాటి నుంచి.. ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి వైఎస్ షర్మిల ఆసక్తి కనబరుస్తూ వచ్చారు. ఆ విషయాన్ని ఆమె పదే పదే ప్రకటించారు కూడా. ఈలోగా కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడానికి సంబంధించి చర్చలు మొదలయ్యాయి. షర్మిల అందుకు సుముఖంగానే స్పందించినప్పటికీ తాను కోరుకునే పాలేరు స్థానం తప్పకుండా దక్కుతుందని ఆశించారు.
అయితే ఆమె పార్టీ విలీన ప్రక్రియ అనుకున్న దానికంటే ఆలస్యం అయింది. ఈలోగా అభ్యర్థుల ఎంపిక సంబంధించి కసరత్తు మొదలు కావడంతోపాటు కొన్ని ఖరారు కావడం కూడా జరుగుతూ వస్తోంది. తాజాగా భారాస పట్ల అసంతృప్తితో ఉన్న సీనియర్ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు, రేవంత్ రెడ్డి కలిసి కాంగ్రెసులోకి ఆహ్వానించడం జరిగింది. ఆయన కోరుకుంటున్న పాలేరు స్థానాన్ని ఇవ్వడానికి కాంగ్రెస్ అధిష్టానం సూత్రప్రాయంగా అంగీకరించినట్లు కూడా వార్తలు వచ్చాయి. అంటే షర్మిలకు పాలేరు అసెంబ్లీ స్థానం ఇవ్వడం లేదు అని తేల్చేసినట్లే.
తాను కోరుకున్న, అంతో ఇంతో గ్రౌండ్ వర్క్ చేసిన పాలేరు నియోజకవర్గం దక్కకపోతే షర్మిల పరిస్థితి ఏమిటి? సోనియా గాంధీని నమ్మి ఆమె తన పార్టీని విలీనం చేయవచ్చు గాక, అందుకు పొందే ప్రత్యుపకారం ఏమిటి? అనేది ప్రశ్నార్ధకంగా ఉంది.
ఒకసారి విలీనం పూర్తయిన తర్వాత.. ‘పార్టీ అవసరాల కోసం’ అనే ముసుగు కప్పి షర్మిల ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలోనే కీలకంగా పని చేయాలని సోనియమ్మ పురమాయిస్తే గనుక ఆమె ఏం చేస్తారు అనే సందేహం పలువురికి కలుగుతోంది.
సోనియా పెత్తందారీ ధోరణికి కొరుకుడు పడని స్వతంత్ర వ్యక్తిత్వంతో సొంత పార్టీ పెట్టుకుని ఎదిగి ముఖ్యమంత్రి అయిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి జగన్ ను దెబ్బ కొట్టడానికి సోనియా షర్మిలను ఒక అస్త్రం లాగా వాడుకుంటే ఆమె ఏమైపోతారు? అనే చర్చలు ఇప్పుడు జరుగుతున్నాయి. కాలగమనంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి.