ఒక దేశం .. ఒకేసారి ఎన్నిక‌లు.. మ‌ళ్లీ తెర‌పైకి!

దేశంలో ఒకేసారి లోక్ స‌భ‌, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించాల‌నేది ప్ర‌ధాన‌మంత్రి హోదాలో న‌రేంద్ర‌మోడీ చాన్నాళ్లుగా చేస్తున్న ప్ర‌య‌త్నం! దాదాపు ఐదారేళ్ల నుంచి మోడీ ఈ మాట‌ను ప్ర‌స్తావిస్తూ వ‌స్తున్నారు. లోక్ స‌భ…

దేశంలో ఒకేసారి లోక్ స‌భ‌, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించాల‌నేది ప్ర‌ధాన‌మంత్రి హోదాలో న‌రేంద్ర‌మోడీ చాన్నాళ్లుగా చేస్తున్న ప్ర‌య‌త్నం! దాదాపు ఐదారేళ్ల నుంచి మోడీ ఈ మాట‌ను ప్ర‌స్తావిస్తూ వ‌స్తున్నారు. లోక్ స‌భ ఎన్నిక‌ల‌తో పాటే దేశంలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లు ఒకేసారి పెట్టేస్తే.. మ‌ధ్య‌మ‌ధ్య‌లో ఎన్నిక‌ల అంత‌రాయాలు ఉండ‌వ‌నేది మోడీ వాద‌న‌గా స్ప‌ష్టం అవుతోంది. అయితే ఇందులో హిడెన్ అజెండా ఉంద‌నే వారూ ఉన్నారు.

అయితే లాజిక‌ల్ గా అన్ని రాష్ట్రాల ఎన్నిక‌లూ ఒకేసారి జ‌రగాలి అనే వాద‌న నిల‌బ‌డ‌దు. రాజ్యాంగం అధికారంలోకి ఉన్న పార్టీలకు ఇచ్చిన హ‌క్కును ఇది హ‌రించి వేస్తుంది. విశ్వాస తీర్మానాలు, అవిశ్వాస తీర్మానాలు అర్థం లేనివి అవుతాయి! ఒక‌వేళ ఏదైనా రాష్ట్రంలో ప్ర‌భుత్వం ప‌డిపోతే లేదా, ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసుకుని ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని ఆ రాష్ట్రంలోని అధికార పార్టీ అనుకుంటే… అంటే మెజారిటీ ఎమ్మెల్యేలు భావిస్తే… అప్పుడు మ‌ళ్లీ దేశంలో ఎన్నిక‌లు వ‌చ్చే వ‌ర‌కూ ఆగుతారా! 

అందునా ప్ర‌భుత్వాల‌ను కూల‌దోయ‌డంలో బీజేపీ త‌ల‌పండిపోయింది.  ఎమ్మెల్యేల‌ను అటూ ఇటూ జంప్ చేయించి త‌న ప్ర‌భుత్వాల‌ను ద‌ర్జాగా ఏర్పాటు చేసుకుంటూ ఉంది. ఇలాంట‌ప్పుడు.. ఎక్క‌డైనా మధ్యంత‌ర ఎన్నిక‌లు జ‌ర‌పాల్సిన ప‌రిస్థితి వ‌స్తే.. అప్పుడు మ‌ధ్య‌లో ఎన్నిక‌లు వ‌చ్చిన‌ట్టు కాదా? 

అలాంటి స‌మ‌స్యే ఉండ‌ద‌ని మోడీ చెప్ప‌ద‌లుచుకున్నారా! ఏ రాష్ట్రంలో త‌మ‌కు న‌చ్చ‌ని ప్ర‌భుత్వాన్ని ప్ర‌జ‌లు ఎన్నుకున్నా.. ఎమ్మెల్యేల‌ను కొనేసి మ‌ధ్యంత‌రం లేకుండానే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తామ‌ని చెబుతున్నారా! మ‌ధ్య‌ప్ర‌దేశ్, క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర‌ల్లో ఎమ్మెల్యేల‌ను అటూ ఇటూ చేసి కూడా బీజేపీ మ‌ధ్యంత‌రం రానీకుండా అడ్డ‌దారి ప్ర‌భుత్వాల‌ను కొన‌సాగించింది, కొన‌సాగిస్తోంది!

ఏ ర‌కంగా చూసినా.. ఒక దేశం, ఒకేసారి ఎన్నిక‌లు అనే త‌ర్కానికి నిల‌బ‌డ‌దు. అయితే దీన్ని మోడీ ఇప్ప‌ట్లో వ‌దిలేలా లేరు. ఈ మేర‌కు పార్ల‌మెంట్ లో ఈ అంశాన్ని చ‌ర్చ‌కు పెడ‌తార‌ట‌! ఇందు కోసం స్పెష‌ల్ సెష‌న్ నిర్వ‌హించ‌బోతున్నార‌ట‌! సెప్టెంబ‌ర్ 18 నుంచి 22 వ‌ర‌కూ పార్ల‌మెంట్ ప్ర‌త్యేక స‌మావేశాల‌ను నిర్వ‌హించి ఒక దేశం, ఒకేసారి ఎన్నిక‌లు అనే అంశంపై కూలంక‌షంగా చ‌ర్చిస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతూ ఉంది. 

మ‌రి ప్ర‌త్యేక చర్చాకార్య‌క్ర‌మం అంటే, బిల్లు కూడా ప్ర‌వేశ పెట్టి ఆమోదం చేయించుకుంటారా? ఆ బిల్లుతో దేశంలో పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌తో పాటు అన్ని రాష్ట్రాల ఎన్నిక‌లూ జ‌ర‌గ‌బోతున్నాయా? ఇది భార‌త ప్ర‌జాస్వామ్యాన్ని ఏ దిశ‌గా తీసుకెళ్తుంది? అస‌లు పార్ల‌మెంట్ లో బిల్లు ద్వారా రాష్ట్రాల ప్ర‌భుత్వాల‌ను ప‌ద‌వీకాలాన్ని కేంద్ర ప్ర‌భుత్వ ప‌ద‌వీకాలానికి స‌రిపెట్ట‌డం సాధ్యం అవుతుందా? ఇలాంటి ప్ర‌శ్న‌లన్నింటికీ ప్ర‌త్యేక స‌మావేశాల్లో స‌మాధానం దొరుకుతుందేమో!