వైసీపీ సోషల్ మీడియా సారథి సజ్జల భార్గవ్‌పై ట్రోలింగ్ మొదలైంది. కనీసం సోషల్ మీడియాలో అకౌంట్ లేని యువకుడికి సారథ్య బాధ్యతలు అప్పగించడం ఒక్క వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే సాధ్యమనే సెటైర్స్ వెల్లువెత్తుతున్నాయి. ఈ విమర్శలకు కనీసం కౌంటర్ ఇచ్చే పరిస్థితి కూడా వైసీపీ సోషల్ మీడియాకు లేదు. ఎందుకంటే వైసీపీ సోషల్ మీడియా సైన్యాధ్యక్షుడిగా నియమితుడైన సజ్జల భార్గవ్‌కు శుభాకాంక్షలు చెప్పడానికి ఆ పార్టీ యాక్టివిస్టులు ప్రయత్నించారు.
శుభాకాంక్షలతో కూడిన పోస్టును సజ్జల భార్గవ్ ఫేస్‌బుక్ అకౌంట్‌కు ట్యాగ్ చేద్దామంటే… ఎక్కడా కనిపించడం లేదని వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు వాపోతున్నారు. అలాగే సజ్జల భార్గవ్‌కు ట్విటర్ అకౌంట్ కూడా లేదని వారు చెప్పడం గమనార్హం. భార్గవ్‌కు దాదాపు మూడు నెలల క్రితమే సోషల్ మీడియా బాధ్యతల్ని సీఎం జగన్ అప్పగించారు. కనీసం అప్పుడైనా ఆయన సోషల్ మీడియాలో తన పేరుతో అకౌంట్స్ ఓపెన్ చేసుకుని వుండాల్సింది.
ఏ బాధ్యతలు లేనప్పుడు ఎవరూ ప్రశ్నించే పరిస్థితి వుండదు. కానీ సోషల్ మీడియా బాధ్యతల్ని తీసుకుంటున్నప్పుడైనా ట్విటర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాలలో అకౌంట్స్ తెరిచి వుండాల్సింది. ఇలాగైతే సోషల్ మీడియాను ఎలా నడుపుతారనే ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వుంటుంది.
సోషల్ మీడియాలోని వివిధ విభాగాల్లో సొంత ఖాతా లేకుంటే, సీరియస్ పర్సన్‌కు బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రిగా జగన్‌ను టార్గెట్ చేస్తారు. ఇప్పటికైనా విమర్శలకు అవకాశం ఇవ్వకుండా భార్గవ్ చర్యలు చేపట్టాల్సి వుంది.