ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ ఎండీ ఆర్కేకు ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడు కన్నా సోము వీర్రాజు సుతిమెత్తగానే ఓ రేంజ్లో గడ్డిపెట్టారు. చాలా మర్యాదకరమైన భాషలోనే ఆర్కేకు ఎక్కడ తగలాలో అక్కడ తగిలేలా కోడికత్తి లాంటి పదునైన అక్షరాలతో ఆర్కేకు ఘాటైన సమాధానం ఇచ్చారు.
ఆర్కేపై సోము వీర్రాజు ఆగ్రహానికి కారణం….ఈ రోజు “హలో.. వింటున్నారు!” శీర్షికతో రాసిన కొత్త పలుకు వ్యాసంలో “మీ జీవీఎల్.. మీ ఇష్టం!” అనే సబ్ హెడ్డింగ్‌తో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహా రావుపై ఘాటైన వ్యాఖ్యలు చేయడమే. ఆర్కే వ్యాసంలో జీవీఎల్‌పై ఏముందో ముందు తెలుసుకుందాం.
“ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖపై స్పందిస్తూ, భార తీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి జి.వి.ఎల్.నర్సింహారావు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడమే కాకుండా బీజేపీకి కూడా నష్టం కలిగించేవిగా ఉన్నాయి. అధికార వైసీపీ తరఫున వకాల్తా పుచ్చుకున్నట్టుగా జీవీఎల్ వ్యాఖ్యలు ఉన్నాయని బీజేపీ రాష్ట్ర నాయకులే వాపోతున్నారు. జీవీఎల్ వంటి వారి వల్ల రాష్ట్రంలో పార్టీ బలపడకపోగా ఎప్పటికప్పుడు ఆత్మరక్షణలో పడి పోతోందని ఆ పార్టీ ముఖ్యుడొకరు వ్యాఖ్యానించారు. ఎవరడిగారని జీవీఎల్ ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చినట్టు మాట్లాడారో తెలి యడం లేదని ఆయన వాపోయారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలనుకుంటున్న పార్టీ వ్యవహరించవలసిన తీరు ఇదేనా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. బీజేపీ పెద్దల మనుసులో ఏముందో తెలియదు గానీ, వారు నిజంగానే ఆంధ్రప్రదేశ్‌లో బలపడాలి అనుకుంటే జీవీఎల్ వంటి వారిని ముందుగా అదుపు చేయాలి. మా పార్టీ మా ఇష్టం అనుకుంటే మీ ఇష్టం!” అని ఆర్కే రాశారు. దీన్ని బట్టి టీడీపీకి, ఎల్లో మీడియాకు జీవీఎల్ ఎంత కొరకరాని కొయ్యగా మారారో అర్థం చేసుకోవచ్చు.
ఇదిలా ఉండగా నూతన అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు తీసుకున్న తర్వాత…ఆ పార్టీ ప్రతి అంశంపై చురుగ్గా స్పందిస్తోం దనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మీడియాను శిఖండిలా అడ్డుపెట్టుకుని టీడీపీ ఆడుతున్న డ్రామాలకు సోము వీర్రాజు నాయకత్వంలోని బీజేపీ ఎప్పికప్పుడు చెక్ పెడుతోంది. ఈ నేపథ్యంలో జీవీఎల్‌పై ఆర్కే అనుచిత వ్యాఖ్యలకు సోము వీర్రాజు ఘాటైన కౌంటర్ ఇచ్చారు. ఆర్కేకు ఆయన బహిరంగ లేఖ ద్వారా హితవు పలికారు.
” మీ రాజకీయ సలహాలు చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఇవ్వండి. అసెంబ్లీలో టీడీపీ 23 స్థానాలకే పరిమితం అవడంలో మీ పాత్ర కూడా ప్రధానమా కాదా? మీరు ఇలాగే మీ సలహాలను టీడీపీకి కొనసాగిస్తూ పోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 23 నుండి రెండు లేక మూడు స్థానాలకు టీడీపీ పడిపోవడం ఖాయం” అని ఓ పత్రికాధిపతికి గట్టిగా కౌంటర్ ఇచ్చిన సోము వీర్రాజు సాహసాన్ని అభినందించాల్సిందే. ఆర్కే మొహం వాచిపోయేలా పదునైన అక్షరాలతో రాసిన ఆ బహిరంగ లేఖ పూర్తి పాఠం చదువుదాం.
“ఈ రోజు ఆంధ్రజ్యోతిలో మీ సంపాదకీయం చదివాను. అందులో మా ఎంపీ జీవీఎల్ నరసంహారావు గారిని ఉద్దేశంచి “మీజీవీఎల్, మీ ఇష్టం” అనే శీర్షికతో విశ్లేషణ రాశారు. మా జీవీఎల్ గారు చంద్రబాబుగారిని విమర్శించడం మాకే మంచిది కాదు అని మీ అమోఘమైన విశ్లేషణ ద్వారా తెలిపారు.
బీజేపీ ఆంధ్రప్రదేశ్‌లో బలపడాలి అనుకుంటే జీవీఎల్ లాంటి వారిని మా నాయ కత్వమే కట్టడి చేయాలని సెలవిచ్చారు. గతంలో అడ్డగోలుగా ప్రధాని మోదీ గారిని, వారి కుటుంబాన్ని, బీజేపీని టార్గెట్ చేసిన మీకు సడెన్‌గా బీజేపీపై ప్రేమ పుట్టిందని, మేము ఆంధ్రప్రదేశ్‌లో ఎదగటం లేదని మీరు తెగ ఫీల్ అవుతున్నారని మీ విశ్లేషణ ద్వారా తెలిసింది.
ఆ విశ్లేషణ వెనుక కొత్తగా బీజేపీ పైన పుట్టిన ప్రేమ కాదని, ఇది పతనానికి చేరువలో ఉన్న చంద్రబాబునాయుడు గారిని, టీడీపీని రక్షించే ప్రయత్నమని ఇట్టే పిల్లలకు కూడా అర్థమైపోతుంది. మీరు టీడీపీకి సలహాదారునిగా, అనుకూలంగా పని చేస్తారని ప్రజల్లో వినికిడి. మరీ ఇంత పబ్లిక్‌గా, నిర్లజ్జగా పత్రికను అడ్డం పెట్టుకుని మా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం తగునా చెప్పండి. మీ రాజకీయ సలహాలు చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఇవ్వండి. అసెంబ్లీలో టీడీపీ 23 స్థానాలకే పరిమితం అవడంలో మీ పాత్ర కూడా ప్రధానమా కాదా?
అదే నిజమైతే, మీరు ఇలాగే మీ సలహాలను టీడీపీకి కొనసాగిస్తూ పోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 23 నుండి రెండు లేక మూడు స్థానాలకు టీడీపీ పడిపోవడం ఖాయం. మీరు మా జాతీయ నాయకత్వానికి మా నాయకులను ఎలా కట్టడి చేయాలో, మా పార్టీని ఎలా కాపాడుకోవాలో సెలవిచ్చారు. ఈ విశ్లేషణ అసలు మతలబు ఏమిటో, మీ అసలు తాపత్రయం ఏమిటో వారికి త్వరలోనే వివరిస్తాను. మీరేమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. మీరు బహిరంగ విశ్లేషణ రాశారు కనుక మీకు లేఖను కూడా బహిరంగం గానే రాస్తున్నాను. అన్యధా భావించరని ఆశిస్తాను” అని కోస్తా వెటకారాన్ని దట్టించి లేఖ రాశారు.
ఆర్కేకు సోము వీర్రాజు రాసిన బహిరంగ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. “హలో ఆర్కే…సోము వీర్రాజు తిట్లను వింటున్నారా” అంటూ ఆర్కే నేటి కొత్త పలుకు శీర్షికనే ఆయనకు అప్పజెబుతూ నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు.