సినిమా రంగంలో కాపీ అనే మాట పెద్ద ఆశ్చర్యకరం కాదు. కొత్తది కాదు. ఒకే ఐడియా ఇద్దరకు రావడం, ఇన్ స్పయిర్ కావడం వంటి అనేక మార్గాలు వున్నాయి చెప్పుకోవడానికి. శ్రీమంతుడు సినిమా తరువాత కూడా అది స్వాతి మాసపత్రికలో అనుబంధ నవలగా వచ్చినది అని కొర్టు కేసుపడింది. మరి నడుస్తోందో, ఏమయిందో ఇంకా తెలియదు. కానీ చాలా బలంగా వున్న కేసు అని మాత్రం వినిపించింది అప్పట్లో.
కట్ చేస్తే, ఇప్పుడు ఆచార్య ఫస్ట్ లుక్ విషయంలో కూడా అలాంటి వ్యవహారం చోటు చేసుకున్నట్లు అప్పుడే హడావుడి మొదలయింది.
18 నవంబర్ 2006లో కన్నెగంటి అనిల్ కృష్ణ అనే రచయిత, రైటర్స్ అసోసియేషన్ లో పుణ్యభూమి అనే టైటిల్ తో ఓ కథ రిజిస్టర్ చేసుకున్నారు. అందులో సినిమా టైటిల్స్ కు ముందు ఓ సీన్ వుంటుంది. అది ఆయన ఇలా రాసుకుని రిజిస్టర్ చేసారు.
''…..సింహద్వారం దగ్గర జడల స్వామి….శిధిలావస్థలోవున్న ధర్మస్థలి సింహద్వారంపై ఓపెన్ చేస్తే, జడలస్వామి తన అనుచరులతో తదేకంగా సింహద్వారాన్ని, దూరంలోవున్న ఊరిని చూస్తూ,….ఎక్కడ అధర్మం రాజ్యమేలుతుందో, ఎక్కడ అన్యాయం నాలుగు పాదాలతో నడుస్తోంది, అక్కడ భగవంతుడు తన విశ్వరూపం ప్రదర్శించి ధర్మస్థాపన చేస్తాడు. కానీ పద్దెనిమిదేళ్లు కావస్తున్నా, ఆ భగవంతునికి ఈ ఊరిపై జాలిపుట్టలేదు ఎందుకనో…అంటూ స్వామీజీ సింహద్వారాన్ని చూసి, రెండు చేతులు జోడించి, హర హర మహాదేవ శంభో శంకర అంటూ నిష్క్రమిస్తాడు.
ఇప్పుడు ఇది చదివితే ఈ రోజు విడుదలయిన ఆచార్య ఫస్ట్ లుక్ లాగే వున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది.
అసలు నిజం ఏమిటో, అన్ని ఏళ్ల క్రితం రిజిస్టర్ అయిన నవల చదివితే, ఆచార్య సినిమా విడుదలయితే అప్పుడు తెలుస్తోంది. అప్పుడు కూడా ఏముంది? శ్రీమంతుడు రైటర్ కు చెప్పినట్లే, క్రెడిట్ లైన్ ఇవ్వము, కావాలంటే డబ్బులు ఇస్తాము అంటారేమో? దేన్నయినా డబ్బులతో కొట్టేయచ్చు అనే ధీమా ఏమో?