కరోనా విషయంలో పూర్తిగా పగ్గాలు ఎత్తేయమని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాసినట్టుగా ఉంది ఈ వ్యవహారం! అంతరాష్ట్ర ప్రయాణాలకూ, రవాణాకు ఎలాంటి ఆంక్షలు విధించకూడదని రాష్ట్రాలను ఆదేశించిందట కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే రాష్ట్రాలు వాటి మీద సీరియస్ గా లేవు. అయితే.. ఎవరైనా బయటి వాళ్లు ఆయా రాష్ట్రాల్లోకి వచ్చినప్పుడు ఆన్ లైన్ లో వివరాలను తీసుకుంటున్నారు. పేరుకు పర్మిషన్ కోసమంటున్నా.. ఓటీపీ తరహాలో వెంటనే పర్మిషన్ మెసేజ్ లు వస్తున్నాయి.
ఈ ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ వల్ల ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంతో కొంత సౌలభ్యం ఉంటుంది. బయటి రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లు, విదేశాల నుంచి వస్తున్న వాళ్లూ ఎక్కడకు వచ్చారు.. అనుమానితులను పరీక్షించడానికి కూడా అవకాశం ఏర్పడుతూ ఉంది. ఏపీలో ఈ విషయంలో కొంచెం స్ట్రిక్ట్ గానే వ్యవహరిస్తూ వస్తున్నారు.
వాస్తవానికి అంతరాష్ట్ర ప్రయాణాలపై నిబంధనలను ఎత్తేయాలని కేంద్రం ఆగస్టు మొదటి వారంలోనే ప్రకటించింది. అయితే కొన్ని రాష్ట్రాలు ఆన్ లైన్ పర్మిషన్స్ ను కొనసాగిస్తున్నాయి. అత్యవసరంగా వెళ్లే వాళ్లు వెళ్తుంటారు, సరకుల రవాణా కూడా చాలా వరకూ సాగిపోతోంది. కూరగాయలు, నిత్యవసరాలకు ఎప్పుడూ నిబంధనలు లేనే లేవు.
ఇప్పుడు ఆన్ లైన్ పర్మిషన్ కూడా నిమిషాల వ్యవధిలోనే.. మెసేజ్ రూపంలో పంపిస్తున్నారు. మరి ఇది కూడా వద్దని కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. ఈ రూల్ ను కొనసాగిస్తే అది నేరం అవుతుందని కూడా స్పష్టం చేసిందట! అదేమంటే.. వ్యాపార రంగానికి నష్టం అని కేంద్ర పేర్కొన్నట్టుగా సమాచారం.
ఒకవైపు దేశంలో రోజుకు వెయ్యి మంది స్థాయిలో కరోనాతో మరణిస్తున్నట్టుగా స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ప్రకటిస్తోంది. మరి ఇలాంటప్పుడు చిన్నపాటి ఆన్ లైన్ నమోదు కూడా అవసరం లేదా? కరోనా ను మరీ ఇంత లైట్ గా తీసుకుంటున్నారా!