సెంటర్ ఫర్ డాక్టర్స్ నిర్వహించిన ఆన్ లైన్ సమావేశంలో ఆయుష్ యూనియన్ కార్యదర్శి రాజేష్ కొటేచా చేసిన వ్యాఖ్యలు దుమారంగా మారుతున్నాయి. హిందీ రాని డాక్టర్లు ఎవరైనా ఉంటే సమావేశం నుంచి తప్పుకోవచ్చని.. తను మరో భాషలో మాట్లాడేది ఉండదని ఆయన స్పష్టం చేశారట. దేశ వ్యాప్తంగా ఆయుష్ వైద్యులు పాల్గొన్న ఆ సమావేశంలో ఆయన హిందీలో ఉపన్యసించారు. దేశంలో హిందీ మాట్లాడని రాష్ట్రాలు చాలా ఉన్నాయని చెప్పనక్కర్లేదు. అయితే ఆ అధికారి.. తను హిందీలో మాత్రమే మాట్లాడబోతున్నట్టుగా, తనకు ఇంగ్లిష్ అంతగా రాదని అన్నాడట.
అంత వరకే ఆయన చెప్పి ఉంటే అదేం పెద్ద తప్పు కాదు! అంత కీలక స్థాయికి ఎదిగినా తన సబ్జెక్ట్ గురించి నాలుగు ముక్కల ఇంగ్లిష్ నేర్చుకోని వ్యక్తి ఆయన అని అర్థం చేసుకోవచ్చు. అయితే తను హిందీలో మాత్రమే ప్రసంగిస్తున్నట్టుగా, అర్థం కాని వారు సమావేశం నుంచి తప్పుకోవచ్చని వ్యాఖ్యానించడం మాత్రం ఏ మాత్రం సబబుగా లేదు!
తనకు ఇంగ్లిష్ రాదు కాబట్టి.. తన పరిస్థితి అర్థం చేసుకోవాలని చెప్పడానికి, హిందీ అర్థం కాని వాళ్లు సమావేశం నుంచి వెళ్లిపోవచ్చని చెప్పడానికి చాలా తేడా ఉంది!
తెలుగు వాళ్లు, కన్నడ వాళ్లు హిందీ విషయంలో ఎలాగో కుస్తీలు పడుతూ ఉంటారు, అయితే తమిళులు మాత్రం ఈ విషయంలో సహించరు. అందుకే అక్కడ దుమారం రేగింది. ఆ ముఖ్య అధికారి తీరుపై తమిళ రాజకీయ నేతలు మండిపడ్డారు. దేశంలో ఉన్నది భారత ప్రభుత్వమే కానీ హిందీ ప్రభుత్వం కాదు గుర్తుంచుకొమ్మని వారు గద్దిస్తున్నారు.
ఇటీవలే ఎయిర్ పోర్టులో హిందీ రాకపోతే వారిది ఇండియానే కాదన్నట్టుగా కొందరు అధికారులు వ్యవహరిస్తున్నారని.. ఉత్తరాది పెత్తనాన్ని చూపిస్తున్నారని డీఎంకే నేత కనిమొళి ధ్వజమెత్తారు. దక్షిణాది రాష్ట్రాలపై హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నాలు బీజేపీ హయాంలో అధికం అయ్యాయనే ఫిర్యాదులూ ఉన్నాయి. ఇలాంటి క్రమంలో ఆయుష్ సమావేశం వ్యవహారం వివాదాస్పదం అవుతోంది. కొంపదీసి హిందీ రాని వాళ్లకు ఇండియాలో ఉండే అర్హత లేదంటారో ఏంటో!