ప్రధాని పోస్టు.. ఐక్యతకు గొడ్డలిపెట్టు అవుతుందా?

ఇం.డి.యా. కూటమి సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధిస్తే గనుక.. ప్రధాని కాబోయేది ఎవరు? ఈ ప్రశ్నకు ఆ కూటమిలోని ఏ పార్టీ వద్ద కూడా నిర్దిష్టమైన జవాబు లేనేలేదని.. అంత స్పష్టత లేని పార్టీలు,…

ఇం.డి.యా. కూటమి సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధిస్తే గనుక.. ప్రధాని కాబోయేది ఎవరు? ఈ ప్రశ్నకు ఆ కూటమిలోని ఏ పార్టీ వద్ద కూడా నిర్దిష్టమైన జవాబు లేనేలేదని.. అంత స్పష్టత లేని పార్టీలు, నాయకులు.. ఇక ప్రజలకు మంచి ఏం చేస్తారని భాజపా పదేపదే విమర్శిస్తూ ఉంటుంది. అయితే వారి విమర్శలకు  కౌంటర్ గా.. ముంబాయిలోని శివసేన (థాక్రే) వర్గం నాయకుడు ఉద్ధవ్ థాక్రే మాట్లాడుతూ.. ప్రధాని అభ్యర్థిత్వానికి తమ కూటమిలో చాలా ఆప్షన్స్ ఉన్నాయని అంటున్నారు.

మోడీ ఏకఛత్రాధిపత్యాన్ని అడ్డుకోవడానికి, ఎద్దేవా చేయడానికి వీలుగా ఆ మాటలు అంటున్న థాక్రే.. ఎన్డీయే కూటమిలో ప్రధాని అభ్యర్థికి ఆప్షన్స్ ఉన్నాయా? అని అడుగుతున్నారు.

ఇం.డి.యా. కూటమి ప్రస్తుతానికి చాలా ఐక్యంగా ఉన్నట్టు కనిపిస్తున్నది గానీ.. పదవులు, పంపకాల వరకు వస్తే అందరి అసంతృప్తులు బయటకు వస్తాయి. ఈ కూటమి ఏర్పడడానికి తొలినుంచి కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్న నాయకుడు నితీశ్ కుమార్! నితీశ్ నే తమ కూటమి తరఫున ప్రధాని అభ్యర్థిగా నితీశ్ ను చేయడమే ధర్మం అని పలువురు వ్యాఖ్యానిస్తుంటారు. 

అదే సమయలో ఈ సమావేశాలను ఒక క్రమపద్ధతిలో నిర్వహించడంలో కీలకంగానే ఉంటున్న నితీశ్.. తనకు మాత్రం ప్రధాని పదవిమీద ఏమాత్రం ఆశ లేదని అంటుంటారు. ఆయన అనుచరులు, ఆయన సన్నిహితులైన ఇతర పార్టీ నాయకులు మాత్రం ఆయన పేరునే ప్రతిపాదిస్తుంటారు.

ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ పేరును ప్రకటించి కూటమి బరిలోకి దిగాలని కాంగ్రెసు, వారితో పాటు వామపక్ష పార్టీలు అంటుండగా ఆ ప్రతిపాదన కొందరికి ఇష్టం లేదు. మమతా దీదీకి కూడా ప్రధాని పదవిపై మోజు ఉంది. ఆమె ప్రస్తుతానికి బయటపడకుండా మేనేజ్ చేస్తున్నారు.

తాజాగా అరవింద్ కేజ్రీవాల్ పేరు కూడా చర్చలోకి వస్తోంది. అందుకే అరవింద్ కేజ్రీవాల్ అభ్యర్థిత్వాన్నే కూటమి ప్రకటించాలని ఆప్ నాయకులు కోరుతున్నారు. ప్రధాని పదవి గురించి పార్టీలన్నీ గుంభనంగానే ఉన్నాయి. వారు ఇప్పటికి కన్వీనర్ ను కూడా తేల్చుకోలేకపోతున్నారు. ప్రధాని అభ్యర్థిత్వం చర్చ ముంబాయి భేటీలో వస్తే గనుక.. ఆ పార్టీల మధ్య ఉన్న లుకలుకలన్నీ బయటపడిపోతాయని కూడా పలువురు భావిస్తున్నారు. వారి ఐక్యత గాలిబుడగ అవుతుందనే భయం కూడా పలువురిలో ఉంది.