వ్యతిరేకతను పెంచుకుంటున్న జగన్

జగన్ సర్కార్‌లో ఏదో జరుగుతోంది.. ఏదో జరిగిపోతోంది అంటూ నిత్యం ఊదరకొడుతూంది ఓ సెక్షన్ ఆఫ్ మీడియా. జనాలతో సంబంధం లేని వాటికి సమాధానం ఇవ్వకపోయినా, క్లారిటీ ఇవ్వకపోయినా ఓకె. అలా కాకుండా కామన్…

జగన్ సర్కార్‌లో ఏదో జరుగుతోంది.. ఏదో జరిగిపోతోంది అంటూ నిత్యం ఊదరకొడుతూంది ఓ సెక్షన్ ఆఫ్ మీడియా. జనాలతో సంబంధం లేని వాటికి సమాధానం ఇవ్వకపోయినా, క్లారిటీ ఇవ్వకపోయినా ఓకె. అలా కాకుండా కామన్ మాన్‌ను భయపెట్టే వార్తలకు ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సి వుంది. 

జనాల భయాన్ని పోగొట్టాల్సి వుంది. కానీ జగన్ సర్కారు ఆ పని చేయడం లేదు. సర్కారు అంటే ఇక్కడ రాజకీయ నాయకులో, మంత్రులో మాత్రమే కాదు సంబంధిత శాఖ అధికారులు కూడా. ఇటీవల భూములు, ఇళ్లు రిజిస్ట్రేషన్ శాఖ వ్యవహారాల మీద విపరీతంగా హడావుడి జరుగుతోంది. దీనికి రెండు కారణాలు. 

ఒకటి ఇప్పటి వరకు వున్న రిజిస్ట్రేషన్ విధానాన్ని మరింత సులభతరం చేయడానికి చేస్తున్న మార్పులు, చేర్పులు. ఇవి ఎలా వుంటాయి అన్నది పూర్తిగా అమలు లోకి వచ్చిన తరువాత కానీ తెలియదు. అందులో లోటు పాట్లు అర్థం కావు. కానీ ఈ లోగానే ఏదో జరిగిపోతోంది అనే గగ్గోలు జనాల్లో భయం పుట్టిస్తుంది. 

ఇక రెండో కారణం అసలు రిజిస్ట్రేషన్ సిబ్బందికి సంబంధం లేకుండానే అన్ని పనులు జరిగేలా చేయడం. రిజిస్ట్రేషన్ శాఖలో ఇంతా అంతా అవినీతి కాదు. రిజిస్ట్రేషన్ వాల్యూలో పదిశాతం మామూలు అన్నది సర్వాత్రా ఫిక్స్ అయిపోయిన అవినీతి వ్యవహారం. ఇప్పుడు అలాంటిది లేకుండా చేయాలంటే అధికారుల నుంచే ముందుగా కోపరేషన్ వుండదు. వాళ్లే ఇదేదో బీభత్సం అయిపోతోందని వార్తలు పుట్టిస్తారు.

అయిన దానికీ కాని దానికీ పేజీలకు పేజీలు ప్రకటనలు ఇచ్చే ప్రభుత్వం ఇలాంటి వాటికి ఇవ్వాలి. గతంలో ఎలా.. ఇప్పుడు ఎలా వుండబోతోంది. ప్లస్ లూ.. మైనస్ లూ.. వివరించాలి. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ తరువాత ఇక ఒరిజినల్ స్టాంప్ పేపర్లు అనే విధానం వుండదని, ప్రభుత్వ సర్వర్లలోనే అన్నీ నిక్షిప్తమై వుంటాయని. కావాల్సినపుడల్లా జిరాక్స్ తీసుకోవడం లేదా, వాటి మీద రిజిస్ట్రార్ తో సంతకం చేయించుకుని సర్టిఫైడ్ కాపీగా తీసుకోవడం ఇకపై రాబోయే పద్దతి అని ప్రచారం మొదలైంది.

చిరకాలంగా వస్తున్న విధానానికి వ్యతిరేకంగా మరో విధానం అమలు చేయడం తలపెట్టినపుడు మరింత పూల్ ప్రూఫ్ గా వుండాలి తప్ప, భయపెట్టేలా వుండకూడదు. అదే విధంగా సామాన్యుడిని మరింత ఇబ్బంది పెట్టేదిగా వుండకూడదు. ఆస్తి అనేది చాలా వరకు తరతరాలుగా బదిలీ జరిగేది. అలాంటి వాటి విషయంలో సరైన విధానం లేకుండా చేస్తే జనాల్లో భయం పెరుగుతుంది. ఈ భయం వ్యతిరేకతగా మారుతుంది. అప్పుడు ఆ వ్యతిరేకత కాస్తా వ్యతిరేక ఓటుగా మారే ప్రమాదం వుంది.

అది గమనించుకునే స్థితిలో సిఎమ్ జగన్ లేరు. అధికారుల మీద అంతా వదిలేసారు. కానీ ఇది తప్పు అని, తనకే ముప్పు అని తెలుసుకునే రోజు వస్తుందేమో?