జాతీయ రాజకీయాల విషయంలో తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి సారథి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎలాంటి వైఖరిని అనుసరిస్తున్నారో.. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ లో బహుజన సమాజ్ పార్టీ నాయకురాలు, మాజీ ముఖ్యమంత్రి మాయావతి కూడా అదే తరహా వైఖరిని అనుసరిస్తున్నారు.
ఒకవైపు మోడీ సర్కారును కూల్చడానికి దేశంలోని విపక్ష పార్టీలు అన్నింటిని ఒక్కతాటి మీదకు తీసుకురావడానికి కాంగ్రెస్ సారధ్యంలో ఇం.డి.యా. అనే ప్రయత్నం జరుగుతుండగా.. మాయావతి మాత్రం తమ పార్టీ ఆ కూటమికి కూడా దూరం అని విస్పష్టంగా ప్రకటిస్తున్నారు. రెండు కూటములలో ఎవరితోనూ పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశమే బీఎస్పీకి లేదని ఆమె పేర్కొన్నారు.
మొత్తానికి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ మరియు లోక్సభ ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుంది అనే సంగతిని తేల్చి చెప్పారు. 2007లో మాదిరిగా ఈసారి యూపీలో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని మాయావతి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు గాని… 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే సీటు దక్కిన సంగతిని మర్చిపోతున్నరు. ఇం.డి.యా. కూటమిలో చేరకపోవడం పట్ల ఆమెపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూడా ఇం.డి.యా. కూటమిలో చేరకుండా కేంద్రంలోని బిజెపి సర్కారుపై పోటీ చేస్తాం, మోడీని గద్దించుతాం అని నినాదాలు చేస్తుంటారు. అయితే ఇదంతా ఒక పెద్ద డ్రామా అని భారాస అనేది భారతీయ జనతా పార్టీకి బీటీమ్ మాత్రమే అని ఒక ప్రచారం విస్తృతంగా ఉంది. అదే తరహాలో ప్రస్తుతం యుపి రాజకీయాల్లో బహుజన్ సమాజ్ పార్టీ వైఖరి కూడా సేమ్ టు సేమ్ ఇలాగే కనిపిస్తోంది. వారిని కూడా విపక్ష పార్టీలు బిజెపికి బీటీం అనే వ్యవహరిస్తున్నాయి.
మాయావతి రెండు కూటముల పట్ల తమకు విశ్వాసం లేదని ఎంతగా చెప్పినప్పటికీ.. యూపీ ఎన్నికలలో ఆమె పార్టీ ఒంటరిగా పోటీ చేయడం అనేది కచ్చితంగా భారతీయ జనతా పార్టీకి మేలు చేస్తుంది. యోగి సర్కారు వ్యతిరేక ఓట్లలో చీలిక వచ్చి బిజెపి లాభపడుతుందని పలువురి అంచనా.
విపక్షాలలో అందరూ ఒక్కతాటి మీదకు రాకుండా.. ఇలాంటి చిన్న చిన్న చీలిలకలను ప్రోత్సహించడం ద్వారా అంతిమంగా భారతీయ జనతా పార్టీ లాభపడుతుందని, ఇదంతా కూడా వారి స్కెచ్ ప్రకారమే జరుగుతుందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.