వారెవ్వా.. చాట్ జీపీటీలోనే చంద్రబాబు సంక్షేమం!

మామూలుగా ప్రజలకు అందించే సంక్షేమ పథకాల పట్ల చంద్రబాబు నాయుడు విముఖంగా ఉంటారు. సంక్షేమ పథకాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయని, వాటి వలన ప్రజలు సోమరులుగా తయారవుతారని ఆయన సిద్ధాంతం. అందుకే చంద్రబాబు…

మామూలుగా ప్రజలకు అందించే సంక్షేమ పథకాల పట్ల చంద్రబాబు నాయుడు విముఖంగా ఉంటారు. సంక్షేమ పథకాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయని, వాటి వలన ప్రజలు సోమరులుగా తయారవుతారని ఆయన సిద్ధాంతం. అందుకే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని 14 సంవత్సరాల పాటు పరిపాలించినప్పటికీ కూడా.. ఆయన హయాంలో చెప్పుకోదగ్గ రీతిలో, చరిత్రలో నిలిచిపోయే ప్రజాసంక్షేమ పథకం ఒక్కటి కూడా కొత్తగా రూపుదిద్దుకోలేదు. అయితే ఓటమి భయం అనేది చంద్రబాబును ఇప్పుడు రకరకాలుగా ప్రేరేపిస్తోంది. ఇప్పుడు, ఆచరణలో సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించకుండా తమ పార్టీని గెలిపిస్తే ఏమేం చేస్తానో తెలియ చెబుతూ తెలుగుదేశం పార్టీ ఇబ్బడిముబ్బడిగా వరాలను కురిపిస్తోంది. 

తాజాగా రక్షాబంధన్ సందర్భంగా తనకు రాఖీ కట్టిన తెలుగు మహిళలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఈసారి ఎన్నికల్లో నెగ్గితే తమ ప్రభుత్వం మహిళలకు ఏం మేలు చేస్తుందో చంద్రబాబు చాటుకోవడానికి ఉత్సాహపడ్డారు. ఆల్రెడీ ప్రకటించిన పథకాలనే మళ్లీ ఏకరవు పెట్టారు. పేద కుటుంబాలకు ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం అంటున్న చంద్రబాబు నాయుడు.. అవసరమైతే మరొక సిలిండర్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని అనడం విశేషం. ‘‘అవసరం అయితే నాలుగో సిలిండర్’’ అనే మాటలను ప్రభుత్వం ఎలా సమర్ధించుకోగలుగుతుందని అనుకుంటున్నారో వారికే తెలియాలి. ‘అవసరం’ అనే రూపంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మాత్రమే నాలుగో సిలిండర్ ఇస్తారేమోనని ప్రజలు అంటున్నారు.

పేదవాడు మరింత పేదవాడు అవుతున్నాడు- ధనికుడు మరింత ధనికుడు అవుతున్నాడు- ఇలాంటి పాచిపోయిన అవే మాటలను చంద్రబాబు నాయుడు రక్షాబంధన్ దినోత్సవం సందర్భంగా కూడా మహిళలతో అన్నారు. మహిళలకు అండగా ఉండేందుకు మరిన్ని కార్యక్రమాలు చేపడతామని కూడా వెల్లడించారు.

తాను అధికారంలోకి వచ్చిన తొలినాటి నుంచి హైటెక్ ముఖ్యమంత్రి అనే ప్రచారాన్ని విస్తృతంగా కోరుకుంటుండే చంద్రబాబు నాయుడులోని సాంకేతిక తెలివితేటలు, అప్డేటెడ్ పరిజ్ఞానం ఎంత ఘోరంగా ఉన్నాయో ఆయన రాఖీ ప్రసంగాన్ని గమనిస్తే అర్థమవుతుంది. ఆరోజున మహిళలకు ఒక కొత్త వరాన్నీ ప్రకటించకపోగా.. మనకు ఏమేం కావాలో అవన్నీ ఇవ్వడానికి ఇప్పుడు చాట్ జిపిటి వచ్చింది అని చంద్రబాబు నాయుడు అంటున్నారు.

చంద్రబాబు నాయుడు దృష్టిలో ‘‘మనకు ఏమేం కావాలో ఇచ్చేందుకు’’ చాట్ జిపిటి వచ్చిందిట. ఆయన ప్రకటిస్తున్న సంక్షేమ పథకాలు అన్నింటిని చాట్ జిపిటి ద్వారా అందిపుచ్చుకోమని బహుశా చంద్రబాబు సంకేతాలు ఇస్తున్నారేమో అని జనం నవ్వుకుంటున్నారు. చాట్ జిపిటిలో సలహాలు, సమాచారమూ పొందవచ్చు. అంతేతప్ప ఏది పడితే ఏది పడితే అది అడిగితే, అది మీకు ఇచ్చేస్తుంది అని అర్థం వచ్చేలా చంద్రబాబు చెబుతుండడం విశేషం. ‘చాట్ జిపిటి’ అంటే ఏంటో.. అది ఎలా పనిచేస్తుందో ఈ హైటెక్ నాయకుడు చంద్రబాబుకు ప్రాథమిక అవగాహన ఉందా? అని జనం నవ్వుకుంటున్నారు.