లేక లేక ఒకరు వస్తే.. డోర్స్ క్లోజ్ చేశారు!

తెలంగాణ భారతీయ జనతా పార్టీ దారుణమైన అభ్యర్థుల కొరతతో బాధపడుతోంది. వారికి అర్జంటుగా నాయకులు కావాలి. ఇతర పార్టీల నుంచి ఎవరు వచ్చినా సరే.. వెంటనే తమలో కలిపేసుకోవడానికి వారు సిద్ధంగానే ఉన్నారు. అయితే…

తెలంగాణ భారతీయ జనతా పార్టీ దారుణమైన అభ్యర్థుల కొరతతో బాధపడుతోంది. వారికి అర్జంటుగా నాయకులు కావాలి. ఇతర పార్టీల నుంచి ఎవరు వచ్చినా సరే.. వెంటనే తమలో కలిపేసుకోవడానికి వారు సిద్ధంగానే ఉన్నారు. అయితే మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక వెలుగు వెలిగిన నాయకుడు, ఇటీవలే భారత రాష్ట్ర సమితికి రాజీనామా చేసి.. భాజపాలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటే ముహూర్తం కూడా ఫిక్స్ చేసిన తర్వాత ఆయన చేరికను ఇతర నాయకులు అడ్డుకున్నారు. ఆ నాయకుడు మరెవ్వరో కాదు క్రిష్ణయాదవ్. 

హైదరాబాదు నగర రాజకీయాల్లో పురాతన కాలంనుంచి తనకంటూ ఒక ముద్ర ఉన్న క్రిష్ణయాదవ్.. గతంలో చేసిన నేరాలకు శిక్ష పడిన తర్వాత.. రాజకీయ ప్రాభవం కోల్పోయారు. ఈలోగా ఆయన పార్టీ తెలుగుదేశం కూడా తెలంగాణలో అంతరించి పోయింది. తర్వాత భారాసలో చేరి ఏదో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ వచ్చారు. ఈ ఎన్నికల్లో టికెట్ ఆశించిన క్రిష్ణ యాదవ్, ఆశాభంగం తప్పకపోయేసరికి భారాసకు రాజీనామా చేశారు. కమలదళం చేరబోతున్నట్టు ప్రకటించారు. కిషన్ రెడ్డి, మోడీ బొమ్మలతో భారీ ఫ్లెక్సిలు కూడా చేయించి.. నగరంలో వాటిని ప్రచారంలో పెట్టారు. 

మాజీ మంత్రి అయిన క్రిష్ణ యాదవ్ ను పార్టీలోకి తీసుకురావడానికి , బిజెపి చేరికల కమిటీ సారథి ఈటల రాజేందర్ స్వయంగా ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. అంతా ఖరారయ్యాక బిజెపిలోని కొందరు సీనియర్ నాయకులు మోకాలడ్డడంతో క్రిష్ణయాదవ్ చేరిక ఆగిపోయింది. బిజెపి మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు కొడుకు వికాస్ రావు పార్టీలో లాంఛనంగా చేరారు. కానీ.. క్రిష్ణ యాదవ్ ను మాత్రం ముహూర్తం పెట్టిన తర్వాత.. చేరికను ఆపేశారు. 

దీనికి కారణం.. గతంలో ఆయనకు ఉన్న నేరచరిత్ర అని చెబుతున్నారు గానీ, వాస్తవంలో ఆయన అంబర్ పేట్ నియోజకవర్గాన్ని ఆశిస్తుండడమే కారణం అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గతంలో అంబర్ పేట్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2018 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత.. ఎంపీ అయి కేంద్ర కేబినెట్ చాన్స్ కొట్టేశారు. పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేని ఈ ఎన్నికల్లో ఆయన మళ్లీ పోటీచేయకపోవచ్చు.. అయితే ఆయన భార్య పోటీచేయవచ్చుననే ప్రచారం ఉంది. అందువల్లనే క్రిష్ణయాదవ్ చేరిక వల్ల.. తన భార్యకు టిక్కెట్ దక్కకపోవచ్చునని ఆయన చేరికకు మోకాలడ్డినట్టుగా ప్రచారం జరుగుతోంది. 

భారతీయ జనతా పార్టీ అసలే క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఇలాంటి స్థితిలో ఎవరు వస్తే వారిని చేర్చుకుని పార్టీని బలోపేతం చేసుకోవాల్సింది బదులుగా.. ఇలా తమ తమ స్వార్థంతో వస్తున్న వారిని కూడా వెళ్లగొడితే పార్టీకి నష్టం అని పలువురు అంటున్నారు. ఇలాంటి పనులు పార్టీలోని ప్రస్తుత నాయకుల మధ్య విభేదాలు పుట్టడానికి కూడా కారణమవుతాయని పలువురు విశ్లేషిస్తున్నారు.