జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ఓటమికి ఆయన స్వీయ తప్పిదాలే తప్ప మరొకరు కారణం కాదు. కానీ ఆ చేదు నిజాన్ని ఆయన ఇంకా తెలుసుకోలేకున్నారు. పైగా తనను ఓడించారని ప్రజలపై అక్కసుతో ఉన్నట్టు పవన్ మాటలు చెప్పకనే చెబుతున్నాయి. రాజకీయంగా ఎదిగేందుకు ఎన్నో సానుకూల అంశాలు పవన్‌కు ఉన్నప్పటికీ, వాటిని సద్వినియోగం చేసుకోవడంలో ఆయన విఫలమవుతున్నారు.
ప్రశ్నించడానికి ఓ పార్టీ అవసరమంటూ ఏడేళ్ల క్రితం ఆయన జనసేనను స్థాపించారు. జనసేన పెట్టిన తర్వాత రెండు సార్వత్రిక ఎన్నికలు కూడా పూర్తయ్యాయి. ఇప్పటికీ పార్టీకి సంబంధించి కమిటీలు లేవంటే ఆయన రాజకీయ పంథా ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిన్న ఉత్తరాంధ్ర జిల్లాల జనసేన నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… అసెంబ్లీ ఎన్నికలకు 26 నెలలే సమయం ఉందన్నారు. ఈ లోపు పార్టీని బలోపేతం చేస్తామన్నారు. అందరి ఆమోదంతో కమిటీలు వేస్తామన్నారు.
84 నెలలుగా పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టలేదనేందుకు ఇంత కంటే నిదర్శనం ఏం కావాలి? ఇప్పటికైనా పార్టీ నిర్మాణంపై పవన్ దృష్టి పెట్టినందుకు జనసైనికులు సంబరపడుతుంటారు. ప్రధానంగా ఎన్నికల్లో జనసేన విఫలం కావడానికి ఆయన అనుసరిస్తున్న పంథానే కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
2014 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ పోటీ చేయకుండా టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు తెలిపారు. ఆ కూటమి అధికారంలోకి వచ్చింది. వైసీపీని అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకే టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చినట్టు అనేక సందర్భాల్లో పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో తనను ఓడించిన టీడీపీ, బీజేపీ కూటమి కంటే జనసేనాని పవన్‌నే ప్రధాన శత్రువుగా వైసీపీ అధినేత జగన్ భావించారు.
2019లో కూడా వైఎస్ జగన్ ముఖ్యమంత్రి ఎలా అవుతారో చూస్తానని పవన్ ప్రతిజ్ఞ చేశారు. కానీ ప్రజాభిమానం జగన్‌ను సీఎం చేసింది. ప్రస్తుతానికి వస్తే 2024లో జగన్‌ను అధికార పీఠం నుంచి దించి తీరుతానని పవన్ మరోసారి సవాల్ విసిరారు. తనను సీఎం సీఎం అని జనసైనికులు అంటుంటే పవన్ ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. ప్రతి బహిరంగ సభలోనూ ఈ దృశ్యం ఆవిష్కృతమవుతోంది.
వీటన్నింటిని చూస్తే… తాను అధికారంలోకి రావాలనే తపన, పట్టుదల పవన్‌లో కనిపించడం లేదని చిన్నపిల్లల్ని అడిగినా చెబుతారు. ఎంత సేపూ జగన్‌ను రాజకీయంగా ఎదగనీయకుండా అడ్డుకునేందుకు మాత్రమే ఉన్నాననే సంకేతాన్ని జనంలోకి పవన్‌కల్యాణ్ విజయవంతంగా పంపగలిగారు. ఇందుకు ఎల్లో మీడియా, టీడీపీ శక్తివంచన లేకుండా పని చేశాయి, మున్ముందు కూడా చేస్తూనే ఉంటాయి. ఇదే పవన్ రాజకీయ ఎదుగులకు అడ్డంకిగా మారింది. ఇదే పవన్ ఓటమికి ప్రధాన కారణమైంది. టీడీపీ, వైసీపీలపై వ్యతిరేకంగా ఉన్న వాళ్లకు ప్రత్యామ్నాయ వేదిక అవుతాడనుకున్న జనసేనాని, అలా కాలేకపోయారు.
ఆంధ్రప్రదేశ్‌లో 25-30 శాతం తన సామాజిక వర్గం ఓటర్లున్నప్పటికీ, తన నాయకత్వంపై వారిలో నమ్మకాన్ని కలిగించడంలో పవన్ అట్టర్ ప్లాప్ అయ్యారు. ఎంతసేపూ తనను గాజువాక, భీమవరంలో ఓడించారని ప్రజలపై నిష్టూరమాడుతున్న పవన్‌క ల్యాణ్.. గెలిచేందుకు తానేం చేశారో చెబితే బాగుంటుంది. అంతెందుకు తాను హీరోగా నటించిన ప్రతి సినిమా హిట్ అయ్యిందా? సినిమా ప్లాప్ అయ్యిందని ఇంకో సినిమాలో పవన్ నటించడం లేదా? ఈ మాత్రం లాజిక్ రాజకీయాలకు ఎందుకు వర్తింపచేయరో ఎవరికీ అర్థం కాదు.
విశాఖ ఉక్కు కార్మికుల ఆందోళనకు మద్దతు ఇచ్చిన పవన్‌కల్యాణ్ దాని ప్రైవేటీకరణకు కారణమైన మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వాన్ని మాట మాత్రం కూడా ప్రశ్నించకపోవడం ద్వారా ఆయన చిత్తశుద్ధిని శంకించేలా చేసింది. తనకేది అవసరమో, అంత వరకూ మాట్లాడి వేదిక దిగిపోయినంత మాత్రాన జనం అర్థం చేసుకోలేనంత వెర్రివాళ్లు కాదు కదా?
అంతిమంగా బీజేపీతో పాటు తాను కూడా వ్యతిరేకతను మూటకట్టుకుంటున్న విషయాన్ని గుర్తించకపోతే ఎలా? ఏపీ ప్రభుత్వం అఖిలపక్షం ఏర్పాటు చేయా లని డెడ్‌లైన్ విధించిన పవన్‌కల్యాణ్… మళ్లీ కనిపించేదెన్నడో ఆయనకే తెలియాలి? ఎందుకంటే ఇలాంటి డెడ్‌లైన్లు, హెచ్చరికలు చేయడం పవన్‌కు ఎంత సర్వసాధారణమో, ఇలాంటివి చూసిచూసి విసిగిపోయిన జనానికి అంతే మామూలైంది.
పవన్‌లో నిలకడలేని తనం కూడా ఆయన రాజకీయ ఉన్నతికి అడ్డంకిగా మారింది. మంచోచెడో ఒక సిద్ధాంతాన్ని నమ్ముకు న్నాక, దానిపైనే గట్టిగా నిలబడాలి. ఈ ఏడేళ్లలో టీడీపీ, బీజేపీతో కొంత కాలం, ఆ తర్వాత వామపక్షాలు, బీఎస్పీతో మరికొంత కాలం సహజీవనం చేసిన ఘనత పవన్‌కే దక్కింది.
వామపక్షాలు, బీఎస్పీతో మొహమెత్తి, మళ్లీ బీజేపీతో సహవాసం. దానితో కూడా అన్యమనస్కంగా కాపురం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు టీడీపీతో అనధికారికంగా సంబంధాలు. ఇన్ని రకాల స్టాండ్‌లు తీసుకుంటే….పవన్‌ను నమ్మేదెలా? ఊసరవెల్లి కంటే ఎక్కువగా రంగుల మార్చిన తనపై తనకే ఎన్నడూ అసహ్యం కలగలేదా? అనే ప్రశ్నలు పవన్‌కు నెటిజన్లు సంధిస్తున్నారు.
అలాగే రాజకీయాలను తానెంతో సీరియస్‌గా తీసుకుని వచ్చానని పవన్ పదేపదే చెబుతుంటారు. ఈ మాట చెప్పాల్సింది జనం. పవన్ రాజకీయ నడవడికను చూసి… పవన్ ఎంతో సీరియస్‌గా రాజకీయాలు చేస్తున్నారని, ఆయన వెంట నడవాలని ప్రజలు నమ్మినప్పుడే ప్రయోజనం. అంతే తప్ప ఉత్తినే తనకు తాను గొప్పలు చెప్పుకోవడం మానేయాలి. అలాగే కుల రాజకీయాలకు దూరమంటూనే… తన సామాజిక వర్గంలోని అన్ని ఉప కులాలు ఐక్యమై నాయకత్వం వహించాలని కోరడం ఆయన రాజకీయ పతనానికి పునాది వేసింది. తాను కులనాయకుడనే ముద్ర వేసుకోగలిగారు.
ఇలా అనేక అంశాలు పవన్‌కల్యాణ్ రాజకీయ పతనానికి దారి తీస్తున్నాయి. ఇప్పటికైనా పవన్‌కల్యాణ్ తన ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుంటే తప్పకుండా భవిష్యత్ ఉంటుంది. ఎందుకంటే ఏపీ సమాజం ప్రత్యామ్నాయ రాజకీయాలను కోరుకుంటోంది. అందుకు సరైన నాయకత్వం కోసం ఆంధ్రప్రదేశ్ సమాజం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తోంది.