వైఎస్సార్ జిల్లా బద్వేల్‌లో ఓటర్ల వ్యతిరేకతకు నోటా (నన్ ఆఫ్ ది అబౌవ్) ప్రతిబింబిస్తోంది. ఇది ఒక రకంగా రాజకీయ నాయకులకు ఓ హెచ్చరిక అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బద్వేల్‌లో ఇప్పటి వరకూ ఏడు రౌండ్ల కౌంటింగ్ ముగిసే సరికి నోటాకు 2,098 ఓట్లు రావడం ఆశ్చర్యం, ఆందోళన కలిగిస్తోంది.
బద్వేల్ ఉప ఎన్నికలో మొత్తం 2,15,240 ఓట్లకు గాను 1,47,213 ఓట్లు పోలయ్యాయి. కౌంటింగ్ పూర్తయ్యే సరికి నోటాకు మరిన్ని ఓట్లు పెరిగే అవకాశం ఉంది. 2014లో అర్ధ శాతం కంటే తక్కువగా నోటాకు 550 ఓట్లు, 2019లో ఒకటిన్నర శాతం కంటే తక్కువగా 2,004 ఓట్లు, తాజా ఉప ఎన్నికలో ఇప్పటి వరకూ ఏడు రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యే సరికి 2,098 ఓట్లు దక్కాయి.
ఏపీలో ఇటీవల చోటు చేసుకున్న విద్వేషపూరిత, దూషణల రాజకీయాలపై ప్రజల విముఖతకు నోటాకు పడుతున్న ఓట్లే నిదర్శన మని సామాజికవేత్తలు చెబుతున్నారు. ఇది చిన్న సంఖ్యగా కనిపిస్తున్నప్పటికీ ప్రజల్లో ఇప్పుడిప్పుడే మొదలైన వ్యతిరేకతకు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రాజకీయాలపై నిరాసక్తత పెరుగుదలను నోటా ఓట్లు సూచిస్తున్నాయనేది వాస్తవం. రికార్డుస్థాయిలో నోటాకు ఓట్లు పడడాన్ని అన్ని రాజకీయ పార్టీలు సీరియస్‌గా తీసుకుని తమ తీరు మార్చుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.