బీజేపీకి ఎన్సీపీ మద్దతు? మహాలో కొత్త లెక్కలు!

ఎన్నికల ఫలితాలు వచ్చి పది రోజులు గడిచిపోయినా మహారాష్ట్రలో రాజకీయ సమీకరణాలు ఒక కొలిక్కి రావడం లేదు. కలిసి పోటీ చేసి బీజేపీ-శివసేనలు పీఠం కోసం పీటముడి వేసుకున్నాయి. అధికారాన్ని పంచుకోవడంలో ఆ పార్టీల…

ఎన్నికల ఫలితాలు వచ్చి పది రోజులు గడిచిపోయినా మహారాష్ట్రలో రాజకీయ సమీకరణాలు ఒక కొలిక్కి రావడం లేదు. కలిసి పోటీ చేసి బీజేపీ-శివసేనలు పీఠం కోసం పీటముడి వేసుకున్నాయి. అధికారాన్ని పంచుకోవడంలో ఆ పార్టీల మధ్య తేడాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారంలో కూర్చునేదెవరు? అనేది కూడా చర్చనీయాంశంగా మారింది.
ఈ పరిణామాల్లో రకరకాల రాజకీయ పరిణామాలు ఆసక్తిదాయకంగా మారాయి.

-ముఖ్యమంత్రి పదవీ కాలాన్ని పంచనిదే బీజేపీకి మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదని, అది ఎన్నికల ముందునాటి ఒప్పందమే అని శివసేన అంటోంది.

-అయితే అలాంటిది ఏమీ లేదని బీజేపీ అంటోంది. సీఎం పదవీ కాలాన్ని పంచుకునే ఆలోచన లేదంటోంది. దీంతో కమలం పార్టీతో చర్చలు లేనట్టే అని శివసేన ప్రకటిస్తూ ఉంది.

-సొంతంగా చూస్తే మెజారిటీకి చాలా చాలా దూరంలో ఉంది బీజేపీ. దీంతో మొండి గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా మెజారిటీ నిరూపించుకోవడం సులువు కాదు.

-ఒకవేళ బీజేపీకి ఎన్సీపీ గనుక సపోర్ట్ చేస్తే సులభంగా అధికారాన్ని చేపట్టవచ్చు. అయితే ఎన్సీపీ అధినేతపై ఇటీవల కూడా ఢిల్లీలో కేసులు నమోదు చేశారు. ఇలాంటి నేపథ్యంలో పవార్ వద్దకు బీజేపీ బేరానికి వెళితే అంతకన్నా చెత్త పని మరోటి ఉండకపోవచ్చు.

-అజిత్ పవార్ కు  రాష్ట్రంలో, సుప్రియా సూలేకు సెంట్రల్లో పదవులతో బీజేపీ-ఎన్సీపీ చేతులు కలపవచ్చనే ప్రచారం సాగుతూ ఉంది. అయితే శరద్ పవార్ ఖండిస్తున్నారు.

-శివసేన, ఎన్సీనీ, కాంగ్రెస్, ఇండిపెండెంట్ల కాంబోలో ప్రభుత్వం ఏర్పడవచ్చు. అయితే ఆ కలగూరగంప  ఏర్పడటం పై సందేహాలున్నాయి.

-ఇవన్నీ కాదు, శివసేన ఒత్తిళ్లకు బీజేపీ తలొగ్గడం కూడా ఒక పరిష్కారమార్గం. ముఖ్యమంత్రి పదవీ కాలాన్ని శివసేనకు పంచాల్సి ఉంటుంది కమలం పార్టీ. అదే జరిగితే శివసేన సాధించుకున్నట్టే అవుతుంది. బీజేపీకి మరాఠా పార్టీ ముకుతాడు వేసినట్టుగా అవుతుంది.