వార్నింగ్ ఊసే లేదు.. అరకొరగా చేరికలు

మంగళవారం అర్థరాత్రిలోగా విధుల్లోకి చేరాలి. లేదంటే ఎవ్వరి ఉద్యోగాలు ఉండవు. Advertisement కేసీఆర్ తాజాగా ఇచ్చిన అల్టిమేటం ఇది. ముఖ్యమంత్రి ఈ హెచ్చరిక చేసిన తర్వాత సమ్మెపై ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుందని చాలామంది…

మంగళవారం అర్థరాత్రిలోగా విధుల్లోకి చేరాలి. లేదంటే ఎవ్వరి ఉద్యోగాలు ఉండవు.

కేసీఆర్ తాజాగా ఇచ్చిన అల్టిమేటం ఇది. ముఖ్యమంత్రి ఈ హెచ్చరిక చేసిన తర్వాత సమ్మెపై ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుందని చాలామంది భావించారు. చాలామంది ఉద్యోగులు భయపడతారని, విధుల్లోకి చేరుతారని అంతా ఆశించారు. కానీ కార్మికులు మాత్రం తమ సమ్మె బాట వీడలేదు.

ఓవైపు కేసీఆర్ విధించిన డెడ్ లైన్ తరుముకొస్తున్న వేళ.. కేవలం 12 మంది మాత్రమే నిన్న విధుల్లోకి చేరారు. తాము తిరిగి సర్వీస్ లోకి వస్తున్నట్టు అంగీకార పత్రాలు అందజేశారు.

కేసీఆర్ హెచ్చరికలతో వందల సంఖ్యలో కార్మికులు వెనక్కి వస్తారని భావించిన ప్రభుత్వానికి దీంతో గట్టి షాక్ తగిలింది. పైగా తిరిగి  విధుల్లోకి వస్తున్న వాళ్లంతా ఆఫీస్ స్టాఫ్ కావడం విశేషం.

మరీ ముఖ్యంగా రిటైర్మెంట్ కు దగ్గరపడిన వాళ్లు వీళ్లంతా. రిటైర్మెంట్ ఆఖరి రోజు పనిచేయాలనే షరతు వల్ల చాలామంది తిరిగి విధుల్లోకి చేరినట్టుగా తెలుస్తోంది. అంతేతప్ప, ప్రభుత్వం ఆశించినట్టు డ్రైవర్లు, కండక్టర్లు భారీ సంఖ్యలో విధుల్లోకి చేరడం లేదు.

కేసీఆర్ అల్టిమేటం ప్రకారం, ఈరోజు-రేపు మాత్రం గడువు ఉంది. ఈ 48 గంటల్లో ఇంకెంత మంది తిరిగి తమ డ్యూటీల్లోకి వస్తారో చూడాలి.

మరోవైపు కార్మికుల సమ్మె నిన్నటితో నెల రోజులు పూర్తిచేసుకుంది. వరుసగా 30వ రోజు కార్మికులంతా వివిధ రకాల నిరసన కార్యక్రమాల్లో  పాల్గొన్నారు. ఇవాళ్టి నుంచి తెలంగాణ పల్లెల్లో తిరిగి తమ సమస్యల్ని, హేతుబద్ధమైన డిమాండ్లను ప్రజలకు వివరించబోతున్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం చర్చల్ని తిరిగి ప్రారంభించాలని, హైకోర్టు ఆదేశాల్ని గౌరవించాలని కార్మికులు విజ్ఞప్తిచేస్తున్నారు. అటు సమ్మె వల్ల మరో కార్మికుడు మరణించాడు. వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలంలో ఓ కండక్టర్ గుండెపోటుతో మరణించాడు.

అటు హైకోర్టు కూడా ఈ వ్యవహారంపై గట్టిగా ఉంది. ఆర్టీసీ లెక్కలపై ఇప్పటికే ప్రభుత్వం తప్పుడు వివరాలు సమర్పించిందనే ఆగ్రహంతో ఉన్న కోర్టు.. ప్రభుత్వ బకాయిలు, కార్పొరేషన్ ఇచ్చిన వివరాలతో పూర్తి వాస్తవాలను అఫిడవిట్ రూపంలో సమర్పించాలని ఆదేశించింది. బుధవారానికి అఫిడవిట్ సమర్పించి, గురువారం కోర్టుకు రావాలని ఆదేశించింది.