పవన్ పింక్ రీమేక్ చేస్తాడా? లేక క్రిష్ దర్శకత్వంలో సినిమా చేస్తాడా?
ప్రస్తుతం ఇండస్ట్రీని కుదిపేస్తున్న ఇష్యూ ఇది. పవన్ రీఎంట్రీ ఇవ్వడం ఖాయం అంటున్నారు చాలామంది జనాలు. ఈ సంగతి పక్కనపెడితే, ఇప్పుడు స్వయంగా పవన్ కల్యాణే తనకుతానుగా ఈ విషయంలో లాక్ అయ్యారు. విశాఖ లాంగ్ మార్చ్ సందర్భంగా పవన్ చేసిన ప్రకటన ఇప్పుడు అతడ్నే ఇరకాటంలో పెట్టేసింది.
జగన్ అద్భుత పాలన అందిస్తే తాను వెళ్లి సినిమాలు చేసుకుంటానని వ్యాఖ్యానించారు పవన్. ఈ ఒక్క కామెంట్ తో తన కెరీర్ ను తానే ఇబ్బందుల్లో పెట్టుకున్నారు. నిజంగా ఇప్పుడు పవన్ ఏదైనా సినిమాకు కమిట్ అయితే, జగన్ పాలన అద్భుతంగా ఉందని ఆయన పరోక్షంగా అంగీకరించినట్టు అవుతుంది.
ఒకవేళ అలా జరగకూడదని పవన్ భావిస్తే, జీవితంలో ఇక ఆయన సినిమాలు చేయకూడదు. ఇలా తన ప్రకటనతో తానే చిక్కులు కొనితెచ్చుకున్నారు పవన్. మరోవైపు నిర్మాతలు, దర్శకుల ఆశలపై కూడా నీళ్లు చల్లారు.
విశాఖలో జరిగిన కార్యక్రమంలో మరోసారి తెచ్చిపెట్టుకున్న ఆవేశంతో ప్రసంగించారు పవన్. ఓవైపు ఇసుక పాలసీపై ముఖ్యమంత్రి జగన్ చాలా సీరియస్ గా పనిచేస్తున్నారు. ఇసుక వారోత్సవాల్ని కూడా నిర్వహిస్తున్నారు.
అలా సమస్యను సక్సెస్ ఫుల్ గా ఓ కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న టైమ్ లో ఇసుక కొరత అంటూ పవన్ ఓ సభ నిర్వహించడం హాస్యాస్పదంగా మారింది. పైగా ఇది చూడ్డానికి పొలిటికల్ మీటింగ్ లా కనిపించింది తప్ప, సమస్య పరిష్కారానికి ఒక్క శాతం కూడా పనికిరాలేదు.
అటు పవన్ కూడా ఇసుక కొరత అంశంపై మాట్లాడకుండా మరోసారి తన ఎన్నికల ప్రచారాన్ని గుర్తుచేశారు. తను చిన్నప్పుడు పడిన కష్టాలు, సినిమా ఫీల్డ్, చదివిన పుస్తకాలు, అమ్మా-నాన్న, రాజకీయాల్లో విలువలు, జవాబుదారీతనం అంటూ ఎప్పట్లానే ఊకదంపుడు ప్రసంగం చేశారు. అవసరస విషయాలు టచ్ చేశారు. తన ప్రసంగంతో మరోసారి అసలు విషయాన్ని పక్కదోవ పట్టించారు. పవన్ ప్రసంగం మరోసారి జనసైనికులు ఆవేశపడ్డానికి మాత్రమే పనికొచ్చింది.
మొత్తంగా ఈసారి టీడీపీ ప్రత్యక్ష మద్దతుతో పవన్ ఎట్టకేలకు తన పార్టీ తరఫున ఓ భారీ కార్యక్రమాన్ని నిర్వహించగలిగారు. ఈ సందర్భంగా తను చంద్రబాబుకు దత్తపుత్రుడ్ని కాదని, ప్రజలకు మాత్రమే దత్తపుత్రుడ్ని అంటూ కొన్ని సినిమా డైలాగ్స్ చెప్పినప్పటికీ ఎందుకో అవి సరిగ్గా పేలలేదు.
అన్నట్టు తన కార్యక్రమానికి లాంగ్ మార్చ్ అంటూ పేరుపెట్టిన పవన్, అసలు రోడ్డుపై అడుగుపెట్టలేదు. తన కార్యకర్తలు, ప్రజలతో నడిపించి.. తను మాత్రం ఎంచక్కా కారుపై నిల్చొని అందరికీ దండాలు పెట్టారు.